NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మరణానంతరం కూడా బతికే మార్గం అవయవదానం: డా. అనంతరావు

1 min read

అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం

ఒక్క దానం… అనేక ప్రాణాలకు కొత్త జీవితం

రక్తం గ్రూపులు వేరైన కిడ్నీ మార్పిడి చేయవచ్చు

కర్నూలు, న్యూస్​ నేడు : “మనిషి మరణించిన తర్వాత కూడా మరో మనిషి శరీరంలో బతికే అవకాశం కల్పించేది అవయవదానం మాత్రమే. అవయవదానం మహాదానం… అది ఎన్నో కుటుంబాల్లో ఆశల దీపం వెలిగిస్తుంది” అని కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మరియు ట్రాన్స్ ప్లాంట్ ఫిజిషీయన్ డా. అనంతరావు అన్నారు. అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక అవగాహన ర్యాలీ చేపట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవ మార్పిడి రంగంలో కర్నూలు దేశంలోని ప్రధాన వైద్యకేంద్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ఎదుగుతోందన్నారు. ప్రస్తుతం మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, జీవనశైలి మార్పులు పెరగడంతో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని తెలిపారు. వేలాది మంది కిడ్నీ మార్పిడి కోసం ఎదురు చూస్తుండగా దాతల కొరత తీవ్రమైన సమస్యగా మారిందన్నారు. ప్రజలు అవయవదానంపై అవగాహన పెంచుకొని ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జీవించి ఉన్నప్పుడు ఒక కిడ్నీని లేదా కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేయడం సాధ్యమేనని, అయితే దాత ఆరోగ్య భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ అన్ని వైద్య పరీక్షల అనంతరం మాత్రమే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అలాగే రక్తగ్రూపులు వేర్వేరు అయినప్పటికీ ఆధునిక వైద్యసాంకేతికతతో కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలులో ఏబిఓ ఇన్‌కాంపాటిబుల్ కిడ్నీ మార్పిడులు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దీని వల్ల మరింత మందికి మార్పిడి అవకాశాలు లభిస్తున్నాయన్నారు.కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు యూనిట్ హెడ్ డా. ఆదిత్య మాట్లాడుతూ సాధారణంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు సేకరిస్తామని, అయితే సజీవ దాతల నుంచి కాలేయ దానం చేసి ప్రాణాలు కాపాడే అవకాశం కూడా ఉందని తెలిపారు. సమయానికి లివర్ మార్పిడి జరిగితే తీవ్ర కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులు పూర్తిగా కోలుకుని సాధారణ జీవితం గడపగలరన్నారు.మరణానంతరం గుండె, కాలేయం, మూత్రపిండాలు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, కంటి కార్నియా వంటి అనేక అవయవాలు దానం చేయవచ్చని చెప్పారు. ఒక అవయవదాత ఎనిమిది మంది ప్రాణాలను కాపాడగలడు, మరెంతో మందికి చూపును ప్రసాదించగలడు అని వివరించారు. అవయవదానంపై అపోహలు, భయాలు, మతపరమైన సందేహాలను తొలగించేందుకు సమాజంలోని ప్రతి వర్గం కలిసి పనిచేయాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులతో ముందుగానే అవయవదానం గురించి చర్చించి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు.కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు వైద్యులు, ట్రాన్స్‌ప్లాంట్ బృంద సభ్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా అవయవదాన ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.

About Author