మధ్యాహ్న భోజన పథకం పరిశీలన
1 min read
విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలి
మెనూ, పరిశుభ్రత, నాణ్యతపై అధికారుల పరిశీలన
హొళగుందన్యూస్ నేడు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హొళగుందలో పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సోమవారం అధికారులు, పోలీసు శాఖ అధికారులు, పాత్రికేయులు పరిశీలించారు.పాఠశాలలో గతంలో కొనసాగిన మధ్యాహ్న భోజన ఏజెన్సీ స్థానంలో నూతన ఏజెన్సీ ఏర్పాటు అయ్యే వరకు పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం పాఠశాలలోని విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారులు–1, 2, పోలీసు శాఖకు చెందిన ఎస్ఐ, పత్రికా పాత్రికేయులు, పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు కలిసి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రత, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్న తీరును పరిశీలించారు.పరిశీలన అనంతరం అధికారులు మాట్లాడుతూ, త్రిసభ్య కమిటీ ద్వారా నూతన మధ్యాహ్న భోజన ఏజెన్సీ ఎంపికైన అనంతరం కూడా విద్యార్థులకు భోజన పథకం ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు.


