చింతలపూడి ఎత్తిపోతల పధకం భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలి
1 min read
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ హెచ్చరిక
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: చింతలపూడి ఎత్తిపోతల పధకం భూసేకరణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ హెచ్చరించారు. చింతలపూడి ఎత్తిపోతల పధకం భూసేకరణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో జేసీ అభిషేక్ గౌడ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పధకం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని, అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ సూచించారు. ముఖ్యంగా అసైన్మెంట్ భూములకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా చర్చించి, సంబంధిత భూసేకరణ అధికారులు మరియు తహసీల్దార్లు నోటీసులు జారీ చేసి, చట్టబద్ధమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. చింతలపూడి భూసేకరణ పనులపై గత 40 రోజులుగా ఎటువంటి ప్రగతి ప్రదర్శించకపోవడంపై కొవ్వూరు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన పనితీరు ప్రదర్శించకపోతే శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే ప్రకటించిన భూసేకరణ అవార్డుల స్థితి, భూస్వాములకు పరిహార చెల్లింపుల పురోగతి, భూసేకరణ పూర్తయిన భూములను నీటిపారుదల శాఖకు అప్పగించిన స్థితిని జేసీ సమీక్షించారు. పెండింగ్లో ఉన్న పరిహార చెల్లింపులు మరియు భూముల అప్పగింత ప్రక్రియను వేగవంతం చేసి, ప్రాజెక్టు పనులు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు.జీలుగుమిల్లి మండలంలో ఆర్ఓఎఫ్ఆర్ భూముల అంశాన్ని సమావేశంలో సమీక్షిస్తూ, అవసరమైన ధృవీకరణలను త్వరితగతిన పూర్తి చేసి, తదుపరి భూసేకరణ ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, సంబంధిత మండలాల తహసీల్దార్లు, చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం కార్యనిర్వాహక ఇంజనీర్లు మరియు సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు.


