బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్
1 min read
యు ఎఫ్ బి యు కన్వీనర్ కాళే శ్రీనివాసరావు
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జాతీయ బ్యాంకులలో పనిచేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, అలాగే ద్వైపాక్షికంగా ఒప్పుకున్న పి ఎల్ ఏ విధానాన్ని, ఏకపక్షంగా అమలు చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఏలూరులో బ్యాంకు ఉద్యోగులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేసి ఆర్ఆర్ పేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసు నుంచి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆర్ పేట మెయిన్ రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదగా స్థానిక నరసింహారావు పేట లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్యాంకు వద్దకు చేరింది. ఎస్బిఐ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యు ఎఫ్ బి యు కన్వీనర్ కాళే శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలను కల్పిస్తామని జాతీయ బ్యాంక్ ల యూనియన్ కి హామీ ఇచ్చి చాలా కాలం అయినప్పటికీ అమలు చేయడంలో వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు. బ్యాంకు ఉద్యోగులకు పని భారం బాగా పెరిగిందని, తక్షణమే వారానికి ఐదు రోజుల పని దినాలు కల్పించాలని, పనితీరు ఆధారిత ప్రోత్సాహకం అన్ని క్యాడర్లకూ సమానంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఏలూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో బ్యాంకు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు రీజనల్ సెక్రటరీ విమల్, యూనియన్ బ్యాంక్ ఏఐబిఓసి నాయకులు శ్రీరంగం శ్రీనివాసరావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ నాయకులు వెంకటేశ్వరరావు , బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ నాయకులు ఎస్ శ్రీనివాసరావు,ఇండియన్ బ్యాంక్ జాయింట్ జనరల్ సెక్రటరీ ఎం ఆర్ కె రెడ్డి, డిసిసిబి బ్యాంక్ నాయకులుతదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్, సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడారు. ర్యాలీలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, బ్యాంక్ ఎంప్లాయిస్ కో-ఆర్డినేషన్ కమిటీ మాజీ నాయకులు కే జే ఎస్ సత్యనారాయణ, వి నారాయణరావు తదితర నాయకులు పాల్గొని ప్రసంగించారు.


