యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి టీజీ భరత్
1 min read
ఓర్వకల్లులో భారీ పెట్టుబడులకు చర్యలు – సెమీకండక్టర్, ఫుడ్ పార్క్ పరిశ్రమలకు ప్రోత్సాహం
కర్నూలు, న్యూస్ నేడు : యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖల మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాను ఎంపీ బస్తీపాటి నాగరాజుతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పిస్తూ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం లభించిందని, పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయని వెల్లడించారు. ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చడం ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పడి, యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కర్నూలు జిల్లా వనరులు, భౌగోళిక అనుకూలతలను సద్వినియోగం చేసుకుని ఓర్వకల్లు ప్రాంతానికి సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఐఎస్‌ఎం (ISM) పాలసీ కింద అవసరమైన అనుమతులు, క్లియరెన్స్‌లు లభిస్తే ఓర్వకల్లులో సుమారు రూ.23 వేల కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానికంగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఓర్వకల్లులో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రత్యేకంగా కృషి చేశామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ఉన్న విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని రిలయన్స్ ప్రతినిధులతో చర్చలు జరిపి కర్నూలు జిల్లాలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించామని తెలిపారు. రిలయన్స్ ఆధ్వర్యంలో ఓర్వకల్లులో మరో ఫుడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కర్నూలు జిల్లాకు ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. జిల్లాలోని యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని పైలట్ శిక్షణ పొందాలని, నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా యువత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని మంత్రి సూచించారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా అందుబాటులోకి వచ్చే ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. నగరంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందన్నారు. కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసి, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దీప్తి, కళాశాల డీన్ శౌరుల్, తదితరులు పాల్గొన్నారు.



