NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వేలం పాటలో రూ.1.03 లక్షలకు పలికిన గణేష్ లడ్డు

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్యాపిలి మండలంలోని పలు గ్రామాల్లో గత మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో కొలువుదీరిన గణనాథులకు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన నిమజ్జనోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపయ్యలను గంగమ్మ ఒడికి చేర్చారు.కలచట్ల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో గణేష్ లడ్డూను తలారి పెద్ద వెంకటేష్ రూ.1,03,000లకు దక్కించుకున్నారు. గత ఏడాది కూడా వేలం పాటలో లడ్డూను తానే దక్కించుకున్నట్లు వెంకటేష్ తెలిపారు.ప్యాపిలి మండలంలోని ఎర్రగుంట్లపల్లి, గుడిపాడు, పోతుదొడ్డి, చిన్నపూజర్ల, వెంగనాంపల్లి, ఏనుగుమర్రి, మెట్టుపల్లి, ఎన్.రంగాపురం, ఎస్.రంగాపురం, జలదుర్గం తదితర గ్రామాల్లో సుమారు 150 వినాయక విగ్రహాలను ట్రాక్టర్లపై ఏర్పాటు చేసి శోభాయాత్ర నిర్వహించారు.యువకులు రంగులు పూసుకుని, డప్పులు, వాయిద్యాల నడుమ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వివిధ ఆకృతుల్లో అలంకరించిన గణనాథుల శోభాయాత్రను గ్రామ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. నిమజ్జన కార్యక్రమాలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి.కొన్ని గ్రామాల్లోని చెరువుల్లో నీరు లేకపోవడంతో గణేష్ విగ్రహాలను వెంగనాంపల్లి చెరువుకు తరలించి నిమజ్జనం చేశారు.నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్‌ఐ నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.మళ్లీ వచ్చే ఏడాది కోసం ఎదురుచూపులుఅయితే ప్యాపిలి పట్టణంలో మాత్రం గత 23 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితమయ్యాయి. పట్టణంలోని వీధుల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించే సందడి లేకపోవడంతో ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది అయినా ప్యాపిలి పట్టణంలోని వీధుల్లో గణనాథుల విగ్రహాలు దర్శనమివ్వాలని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. మళ్లీ వినాయక చవితి వచ్చే వరకు ఆ ఎదురుచూపులు కొనసాగాల్సిందే.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *