పెన్షన్ దరఖాస్తు గడువు మరో వారం పొడిగించాలి
1 min read
టెక్నికల్ సమస్యలతో పలువురు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు: వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి మాట్లాడుతూ పెన్షన్ దరఖాస్తుల గడువును మరో వారం రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు పలువురు ప్రజలు సచివాలయాలకు వెళ్తున్నప్పటికీ సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో దరఖాస్తులు సమర్పించుకోలేకపోతున్నారని తెలిపారు.సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి, దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన వారికి మరో అవకాశం కల్పించేందుకు గడువు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా అధికారం చేపట్టకముందు చంద్రబాబు నాయుడు బీసీలకు 50 సంవత్సరాల వయస్సు నుంచే పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు 60 సంవత్సరాల వయస్సు నిబంధన విధించడం సరికాదని ఎస్.కె. గిరి విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పక్కన పెట్టి పాలన సాగిస్తున్నారని ఎస్.కె. గిరి విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని, ముఖ్యంగా పెన్షన్ దరఖాస్తుల విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని కోరారు.ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ నిర్ణయాన్ని తెలియజేస్తారని ఎస్.కె. గిరి అన్నారు.


