ప్యాపిలి మండలంలో సంచార చికిత్స కార్యక్రమం
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు : ప్యాపిలి వైద్యాధికారి డాక్టర్ రాహుల్ చంద్రన్న ఆధ్వర్యంలో వెంకటంపల్లిలో సంచార చికిత్స (104) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీ, బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ తదితర పరీక్షలు నిర్వహించి 32 మందికి చికిత్స అందించారు. మంచానికే పరిమితమైన రోగులకు కూడా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.అనంతరం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి రాఘవేంద్ర గౌడ్ ప్రధానమంత్రి సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రాథమిక స్థాయిలో వ్యాధులను గుర్తించడం, ప్రతి పుట్టిన బిడ్డకు టీకాలు వేయించడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం, నీటిని కాచి చల్లార్చి వడపోసుకుని తాగడం, వ్యాధుల నిర్మూలన, ఫ్రైడే డ్రై డే పాటిస్తూ దోమలను నిర్మూలించడం వంటి అంశాలపై వివరించారు.అలాగే క్షయ, కుష్ఠు, టైఫాయిడ్, హెపటైటిస్ తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ పావని, ఏఎన్‌ఎం లక్ష్మి నర్సమ్మ, ఆశా కార్యకర్తలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఓబులేసు, ప్రజలు పాల్గొన్నారు.


