NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మద్యం షాపుల రెన్యువల్‌పై లైసెన్సుదారులకు అవగాహన సమావేశం

1 min read

ప్రభుత్వ మద్యం పాలసీపై తప్పుడు ప్రచారం సరికాదు: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు

హొళగుంద న్యూస్ నేడు: ఆలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపుల లైసెన్సుదారులకు 2026–27 సంవత్సరానికి సంబంధించిన మద్యం షాపుల రెన్యువల్ ప్రభుత్వ పాలసీ, విధి విధానాలపై కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ సుధీర్ బాబు, ఆలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ లలితాదేవి ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 2026–27 సంవత్సరానికి ప్రభుత్వ మద్యం పాలసీ ప్రకారం ప్రస్తుతం మద్యం వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న లైసెన్సుదారులకు నిబంధనల మేరకు రెన్యువల్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రెన్యువల్ చేసుకోవాలనుకునే లైసెన్సుదారులు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.అనంతరం ప్రభుత్వ మద్యం పాలసీలోని నియమ నిబంధనలపై లైసెన్సుదారుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ క్రమంలో హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన ధన్విక వైన్స్ లైసెన్సుదారుడు శ్రీధర్, ఆయన సోదరుడు సంతోష్ కుమార్ సమావేశంలో ఇతర లైసెన్సుదారుల సమక్షంలో ప్రభుత్వ మద్యం పాలసీపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తూ వారిని నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడినట్లు అధికారులు తెలిపారు.దీంతో కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు జోక్యం చేసుకుని వారిని వారించినట్లు పేర్కొన్నారు. మద్యం షాపును రెన్యువల్ చేసుకోని పక్షంలో తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం నోటిఫై చేసే చర్యలు ఉంటాయని వారికి వివరించినట్లు తెలిపారు. ప్రభుత్వ మద్యం పాలసీపై ఇతర లైసెన్సుదారులను నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడటం సముచితం కాదని అధికారులు సూచించినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా శ్రీధర్ తాను మండల కన్వీనర్‌గా ఉన్నానని పేర్కొంటూ కోపోద్రిక్తంగా సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖపై ఆయన పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమైనవని, సత్యదూరమైనవని అధికారులు పేర్కొన్నారు.శాఖపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వ నిబంధనలు మరియు పాలసీ ప్రకారమే మద్యం షాపుల రెన్యువల్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *