NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

1 min read

ఓట్లను తొలగించు కారణాలను బహిర్గతం చేయాలి

భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

అఖిలపక్ష రాజకీయ పార్టీల డిమాండ్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, సర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలకు ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ముసాయిదా కార్యక్రమం సర్ అస్తవ్యస్తంగా జరుగుతుందని ఆరోపించారు. మన రాష్ట్రంలో నిర్వహించిన సర్ కార్యక్రమంలో 44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం వలన కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా నిరక్షరాస్యులు,పేదలు,వలస కార్మికులు తమ ఓటు హక్కును కోల్పోవడం వలన ప్రజాస్వామ్యానికి తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల్లో సర్ కార్యక్రమ నిర్వహణ లోపాలకు ప్రధాన ఎన్నికల అధికారి బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సర్ పేరుతో తొలగించిన 44 లక్షల ఓట్లను సమగ్రంగా పరిశీలించి అర్హులందరికీ ఓటు హక్కును కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలతో ఈనెల 22వ తారీఖున నిర్వహించిన రౌండ్ టేబుల్ పిలుపుమేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్నికల సంఘానికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు.రాష్ట్రంలో జరిగిన అసమగ్ర సర్ ప్రక్రియను పునః పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారుల విధానాల వలన అప్రతిష్టపాలు అవుతుందని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఓట్ల తొలగింపు జరిగిందని, ఆదరాబాదరాగా ఓట్ల జాబితాను సవరించుటవలన అర్హులైన వారు కూడా తమ ఓట్లు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీకి విధేయుడుగా ఉంటున్న ప్రధాన ఎన్నికల అధికారి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్.పి.ఐ.ఏ పార్టీ జిల్లా నాయకులు మతే బాబి మాట్లాడుతూ బిజెపి ఎన్నికల సంఘాన్ని వాడుకుని తమకు వ్యతిరేకంగా ఉండే దళిత గిరిజన బహుజన ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి తో సక్రమంగా ఓటర్ల జాబితా పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బుద్ధ సోమయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును తూట్లు పొడిచే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.బిజెపి తనకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను ఎన్నికల సంఘం ముసుగులో సర్ పేరుతో తొలగిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన 44 లక్షల ఓట్లతో సరైన కారణాలను ఎన్నికల సంఘం ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి వినతి పత్రాన్ని అందించారు.

About Author