NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విమానయాన రంగంలో యువతకు మంచి అవకాశాలు.. మంత్రి టీజీ భరత్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  విమానయాన రంగంలో యువతకు మంచి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ప్రారంభోత్సవంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో విమానయాన రంగం అభివృద్ధితో పాటు పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కర్నూలులో ఓరియంట్ ఫ్లైట్ ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఇలాంటి శిక్షణ కేంద్రం ఏర్పాటు కావడం ప్రత్యేకమన్నారు. . కర్నూలు విమానాశ్రయ అభివృద్ధి, విమాన సర్వీసుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.  భవిష్యత్‌లో ఓరియంట్ సంస్థ మరిన్ని విభాగాలను విస్తరించే ఆలోచన ఉంటే కర్నూలును కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కర్నూలులో ఇప్పటికే విమాన సౌకర్యం అందుబాటులో ఉన్నందున, భవిష్యత్‌లో సంస్థ మరిన్ని ప్రాజెక్టులు, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని మంత్రి తెలిపారు. కర్నూలులో విమానయాన రంగం అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు అనేక అవకాశాలు ఉన్నాయి. అడుగడుగునా మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగితే కర్నూలు మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. ఓరియంట్ ఫ్లైట్ ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు కర్నూలు యువతకు గొప్ప అవకాశమని మంత్రి పేర్కొన్నారు. పైలట్  శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం దేశ, విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. వైద్యులు, ఇంజనీర్లు వంటి సంప్రదాయ వృత్తులతో పాటు విమానయాన రంగంలో కూడా స్థానిక యువతకు మంచి కెరీర్ అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.కర్నూలు–విజయవాడ మధ్య ప్రస్తుతం ఉన్న విమాన సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచి, ఉదయం–సాయంత్రం రోజువారీగా విమాన రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేంద్ర మంత్రిని కోరారు. కర్నూలు జిల్లాకు చెందిన పలువురు విజయవాడకు ప్రయాణించే నేపథ్యంలో రోజువారీ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటే ప్రజలకు, ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని మంత్రి తెలిపారు.అదే విధంగా కర్నూలు విమానాశ్రయంలో రాత్రి ల్యాండింగ్ సౌకర్యాన్ని మరింత అభివృద్ధి చేయడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రన్‌వే సామర్థ్యాన్ని పెంచే అవకాశాలను పరిశీలించాలని కోరారు. కర్నూలు విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఎంఆర్‌ఓ (Maintenance, Repair and Overhaul) సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అవకాశాలను పరిశీలించాలని మంత్రి కోరారు. విమానాశ్రయానికి సమీపంలో విమానాల నిర్వహణ, పార్కింగ్ తదితర సదుపాయాలు అభివృద్ధి చేస్తే భవిష్యత్‌లో స్థానికంగా వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు.. అదే విధంగా డ్రోన్లు, చిన్న తరహా విమానాల తయారీకి సంబంధించిన పరిశ్రమలు కర్నూలులో ఏర్పాటయ్యే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

కర్నూలు జిల్లాలో ఇప్పటికే పలు పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులు వస్తున్నాయని, భవిష్యత్‌లో పరిశ్రమల కార్యకలాపాలు పెరిగే కొద్దీ విమాన ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విమానాశ్రయ మౌలిక వసతులను ఇప్పటి నుంచే బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలులో డీజీసీఏకు సంబంధించిన ప్రాంతీయ/ఉప ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా పరిశీలించాలని  మంత్రి భరత్ కోరారు.

About Author