ఏలూరు పార్లమెంటు పరిధిలో రూ. 20 కోట్ల రోడ్ల పనులకు అనుమతి
1 min read
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్
గ్రామాల్లో రూ.20 కోట్ల విలువైన పనులకు నిధులు మంజూరు
వీబీ-జీ రామ్ జీ పథకంలో కొత్త సీసీ రోడ్ల నిర్మాణం
వెంటనే పనులు చేపట్టాలని నాయకులకు దిశా నిర్దేశం చేసిన ఎంపీ
పంచాయతీ తీర్మానాలు అందకపోవడం వల్ల అనుమతులు ఇవ్వని గ్రామాలకు రెండో విడతలో నిధులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వీబీ-జీ రామ్ జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా ఈ ఏడాది (2026-27) దాదాపు 20 కోట్ల విలువైన సీసీ రోడ్లకు అనుమతులు మంజూరు చేశామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల కోడ్ రాకముందే ఇప్పటి వరకూ మంజూరైన పనులను వెంటనే మొదలు పెట్టాలని నాయకులకు, అధికారులకు ఎంపీ సూచించారు. ఈ మేరకు ఏలూరు పార్లమెంటు పరిధిలోని 27 మండలాల టీడీపీ ఇన్‌ఛార్జిలు, నాయకులతో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మాట్లాడిన ఎంపీ, ఆ వివరాలను మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యేలు, మండల నాయకులు, ప్రజల నుంచి తన వద్దకు వచ్చిన వినతుల మేరకు దాదాపు అన్ని పనులు కూడా మంజూరు చేయడం జరిగిందని ఎంపీ స్పష్టం చేశారు. మంజూరు చేసిన పనుల వివరాలను ఎమ్మెల్యేలకి, మండల పార్టీ అధ్యక్షులకి, పార్టీ ఇంచార్జిలకు అందరికీ కూడా తన కార్యాలయం ద్వారా సమాచారం అందించామని చెప్పిన ఎంపీ, పనులు మంజూరు అయిన గ్రామాలలో వెంటనే శంకుస్థాపనలు చేసి, పనులు మొదలు పెట్టాలని కోరారు. 2026-27 ఏడాదికిగాను ఇప్పటి వరకూ మంజూరు చేసిన పనుల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం రూ.19.8 కోట్లు విలువైన సీసీ రోడ్లు మంజూరు చేసినట్లు ఎంపీ వివరించారు. పంచాయతీల తీర్మానాలు అందకపోవడం వల్ల పనులు మంజూరు కాని గ్రామాలకు రాబోవు రోజుల్లో రెండో విడతలో నిధులు మంజూరు చేస్తామని ఎంపీ తెలిపారు. గత ఏడాది భారీగా స్మశానవాటికలకు నిధులు కేటాయించామని,వాటి పనులు దాదాపు పూర్తికావచ్చాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చెప్పారు. అయితే, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు స్మశానవాటికలకు నిధులు కేటాయించడంలేదన్నారు. స్మశానవాటికలకు రాబోవు రోజుల్లో మళ్ళీ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు పార్లమెంటు పరిధిలోని అన్ని మండలాలలో మండల నాయకులు, ఇంచార్జిలు గాని, సర్పంచులుగానీ, ప్రజలుగానీ ఎవరెవరు రోడ్లు అడిగారో వాళ్ళందరికీ కూడా సీసీ రోడ్లు మంజూరు చేశామని ఎంపీ స్పష్టం చేశారు. అన్ని పనులు వెంటనే మొదలుపెట్టాలని మండల పార్టీ నాయకులకు, పార్టీ ఇంచార్జిలకు ఎంపీ దిశానిర్ధేశం చేశారు.


