NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్

1 min read

అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు.. జగన్నాథ గట్టులో అక్రమ మైనింగ్‌పై చర్యలకు ఆదేశాలు

కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) కర్నూలు జిల్లా కమిటీ సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, రైల్వే పాసుల పునరుద్ధరణ, పెన్షన్ సౌకర్యం, జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసుల నివారణతో పాటు జగన్నాథ గట్టులోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ అంశాలను ప్రతినిధి బృందం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది.ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేక కమిటీ జిల్లాలో ఇళ్ల స్థలాలు లేని అర్హులైన జర్నలిస్టుల సమస్యను పరిష్కరించేందుకు తన నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ (జేసీ), జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)లతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు తెలిపారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.

అక్రమ మైనింగ్‌పై చర్యలకు ఆదేశాలు

కర్నూలు నగరంలోని జగన్నాథ గట్టులో గతంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత మైనింగ్ అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.

జర్నలిస్టుల ఇతర సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి

ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.జి. ప్రసాద్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు నిరంతరం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నప్పటికీ, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారం లభించడం లేదని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కరించాలని కోరారు.

గతంలో మాదిరిగా జర్నలిస్టులకు రైల్వే పాసులను పునరుద్ధరించాలని, 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు నెలకు కనీసం రూ.10 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, నిర్బంధాలు, అక్రమ కేసులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

 ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధి బృందం

జిల్లా అధ్యక్షుడు ఎం. శివశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు గుడిసె శివన్న, జిల్లా అధ్యక్షుడు ఎం. శివశంకర్, ప్రధాన కార్యదర్శి టి.జి. ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శులు జయరాజు, ఉరుకుందు, నగర కార్యదర్శి ఎర్రమల, మోహన్, శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొని జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *