పెదవేగి జెడ్పీటీసీగా చింతమనేని సాయి నవ్యశ్రీ నామినేషన్ దాఖలు
1 min read
ర్యాలీలో అంబరాన్నంటిన సంబరాలు, అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన జనం
ఢిల్లీ యూనివర్సిటీ విద్యాధికురాలు,సేవాతత్పరతే ఊపిరిగా ప్రజాక్షేత్రంలోకి చింతమనేని మూడో తరం వారసురాలు
దుగ్గిరాల నుంచి ఏలూరు జెడ్పీ కార్యాలయం వరకు వేలాది మందితో పాదయాత్ర, భారీ ర్యాలీ
తల్లిదండ్రుల ఆశీస్సులు, ఏలూరు తూర్పువీధీ గంగానమ్మ, పెదవేగి రాట్నాలమ్మ దర్శనంతో ఎన్నికల సమరంలోకి ముందడుగు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ అరంగేట్రం పండగ వాతావరణంలో ఘనంగా మొదలైంది. ఏలూరు జిల్లా పెదవేగి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీ శుక్రవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు ఆమె ఏలూరు తూర్పు వీధిలోని శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో, అలాగే పెదవేగి మండలం రాట్నాలకుంట లోని శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి ఆలయంలో నామినేషన్ పత్రాలు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో తల్లిదండ్రులు చింతమనేని ప్రభాకర్, రాధారాణి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు, మంగళహారతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తో పాటు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు నవ్యశ్రీ గారికి పుష్పగుచ్ఛాలు అందజేసి విజయీభవ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
దుగ్గిరాల నుంచి ఏలూరు వరకు జనప్రవాహం
దుగ్గిరాల క్యాంపు కార్యాలయం నుండి ఏలూరు జెడ్పీ కార్యాలయం వరకు చింతమనేని నవ్యశ్రీ చేపట్టిన పాదయాత్ర, వాహన ర్యాలీ అపూర్వ ప్రజాదరణ నడుమ సాగింది. దారిపొడవునా వేలాది మంది మహిళలు ప్రజలు నీరాజనాలు పలికారు. అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ, మంగళహారతులతో స్వాగతించారు. భారీ క్రేన్ల సాయంతో గజమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. దెందులూరుతో పాటు ఏలూరు జిల్లాలోని ఏలూరు, చింతలపూడి, పోలవరం, నూజివీడు, కైకలూరు, ఉంగుటూరు, సహా పలు నియోజకవర్గాల నుంచి కూటమి నాయకులు కార్యకర్తలు తరలివచ్చి జై కొట్టారు. అనంతరం ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఉన్నత విద్యార్హతలు సేవా పథంలో నవ్యశ్రీ
రాజకీయ కుటుంబ నేపథ్యంతో పాటు చింతమనేని సాయి నవ్యశ్రీకి అత్యున్నత విద్యార్హతలు, సామాజిక దృక్పథం ఉన్నాయి
విద్యార్హతలు: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర కాలేజ్ – ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బి.ఎ. (ఆనర్స్) పొలిటికల్ సైన్స్,ఆపై సోషియాలజీలో మాస్టర్స్ (ఎం.ఎ.) పూర్తి చేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమైన అనుభవంతో పాటు గ్రామీణాభివృద్ధి, సామాజిక సిద్ధాంతాలపై లోతైన పట్టు సాధించారు.సేవా కార్యక్రమాలు (చింతమనేని ఛారిటబుల్ ట్రస్ట్)చింతమనేని ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా నియోజకవర్గంలో వృద్ధులకు సేవ కార్యక్రమాలు, వికలాంగులకు వీల్ చైర్ల పంపిణీ, నిరుపేద యువతకు మెగా డీఎస్సీ వంటి ఉచిత పోటీ పరీక్షల శిక్షణ అందించడం వంటి సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వృధాగా పోయే సన్మాన శాలువాలను సేకరించి అనాథ పిల్లలకు దుస్తులుగా మార్చి కుట్టించే వినూత్న ఎకో-రీసైక్లింగ్ కార్యక్రమం ద్వారా ఆమె గుర్తింపు పొందారు.కొల్లేరు సమస్యలపై గతంలో కేంద్ర సాధికార కమిటీ (సిఇసి ) ముందు ప్రజావాణిని వినిపించడంలో క్రియాశీల పాత్ర పోషించారు. ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శన, డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారతకు స్వయంగా కృషి చేస్తున్నారు.మూడో తరం నాయకత్వం అధిష్ఠానం మాటే శిరోధార్యం నవ్యశ్రీ తాతగారైన దివంగత చింతమనేని కేశవరావు గతంలో దుగ్గిరాల సర్పంచ్‌గా సేవలందించగా, తండ్రి చింతమనేని ప్రభాకర్ 3వ సారి దెందులూరు ఎమ్మెల్యేగా, మాజీ ప్రభుత్వ విప్‌గా గుర్తింపు సాధించారు. నేడు మూడో తరం నుంచి నవ్యశ్రీ నేరుగా ప్రజాక్షేత్రంలోకి రావడం, ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఆమె పేరు ముందంజలో ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నామినేషన్ అనంతరం నవ్యశ్రీ మాట్లాడుతూ ప్రజాసేవనే పరమావధిగా భావించి ముందుకు సాగుతున్నానని, తనకు పెదవేగి జెడ్పీటీసీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జెడ్పీ చైర్మన్ పదవిపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని, ప్రజల సంక్షేమం, ప్రాంత సమగ్రాభివృద్ధే తన ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో దెందులూరు ఏ యం సి ఛైర్పర్సన్ గారపాటి.రామసీత, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు బొప్పన సుధా, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, మండల పార్టీల అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్, నాగనబోయిన సత్యనారాయణ, మరడాని రవి, నేతల రవి, వంకినేని భాను ప్రకాష్, దెందులూరు నియోజకవర్గ టిడిపి సమన్వయ కమిటీ సభ్యులు, పలువురు క్లస్టర్ ఇంచార్జిలు, సొసైటీల చైర్మన్లు, తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



