ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమాలను బలోపేతం చేద్దాం…పి. రామచంద్రయ్య
1 min read
ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య
న్యూస్ నేడు, పత్తికొండ: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. గురువారం సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంభాల మండపం దగ్గర సిపిఐ మండల కార్యదర్శి యు. కారుమంచి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రిని మొదలుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజా సమస్యల పై చర్చించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో నామినేషన్లు వేయనీయకుండా అధికార పార్టీ నాయకులు పోటీ చేసే అభ్యర్థులను బెదిరింపులకు గురిచేసి బలవంతపు ఏకగ్రీవాలు చేసుకోవడం జరిగిందని, అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు అండగా నిలిచారన్నారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలలోనైనా ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వామపక్షాలు చేపట్టే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి. రాజాసాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు గురుదాస్, సురేంద్ర కుమార్, పెద్ద ఈరన్న, నెట్టికంటయ్య, సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు సిద్దు. ఎంకే సుంకన్న.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.


