గోపూజ, కుంకుమార్చనలతో పులకించిన చిన్న గుమ్మడాపురం
1 min read
– భక్తి పారవశ్యంలో ముగిసిన తితిదే ధార్మిక ప్రవచన యజ్ఞం
అత్యంత భక్తి శ్రద్ధలతో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు,న్యూస్ నేడు: భారతీయ సంస్కృతిలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉన్నదని, ప్రతి పండుగ వెనుక ధార్మిక కోణంతో పాటు సామాజిక కోణం కూడా ముడిపడి ఉన్నదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు స్వాత్మానంద స్వామిచే ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ప్రవచనాల ద్వారా కార్తీక మాస విశిష్టత, గోమహిమ, ధర్మాచరణ ఆవశ్యకతను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా పండితులు గోమాతకు పసుపు, కుంకుమ, నూతన వస్త్రంతో పాటు పూలమాలలతో అలంకరించి, శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులచే అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం గోమాతకు గ్రాసం సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. కార్తిక మాసంలో అత్యంత పవిత్రమైన రోజులలో తిరుమల తిరుపతి దేవస్థానములు నుండి గోపూజ, కుంకుమార్చనలు, ధార్మిక ప్రవచన కార్యక్రమాలు తమ గ్రామంలో జరగడం పట్ల భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రామమంతా భక్తి భావనతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు వెంకటేశ్వర్లు, సాంబశివుడు, రాముడు, చిన్నరాజు, శేఖర్, మౌళాలి, శివన్న, లక్ష్మీదేవి, శ్రీలత, ఉమాదేవి, లక్ష్మిదేవి, విజయలక్ష్మి, నాగమ్మ, సరోజ, రామతులశమ్మ, రామలక్ష్మి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.



