గిడుగు రామ్మూర్తికి ఘన నివాళి
1 min readపల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో: తెలుగు వ్యవహారిక భాషోద్యమకారుడు శ్రీ గిడుగు రామమూర్తి పంతులుకు ఘననివాళు అర్పించారు కడప గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంయుక్త కమిషనర్ మొగిలిచెండు సురేష్. ఆదివారం కడప నగరంలోని ప్రకాశ్ నగర్ లో ఉన్న సుదీక్ష లో గిడుగు రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మొగిలిచెండు సురేష్ మాట్లాడుతూ వ్యవహారిక తెలుగు భాషకు వెలుగుజిలుగులు దిద్దిన మహానుభావుడు, వ్యవహారిక భాషోద్యమకారుడైన గిడుగు రామమూర్తి అని కొనియాడారు. దేశ భాషలందు గొప్పదైన తెలుగు భాష ను వ్యవహారిక భాషగా,ప్రజల భాషగా, పాలనా భాషగా తీర్చిదిద్దడానికి జీవితాన్ని ధారపోసిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ గిడుగు రామమూర్తి అని, ఆయనకు తెలుగు జాతి రుణపడి ఉందన్నారు. పండితులకే పరిమితమైన తెలుగు భాషను పామరులచెంతకు తీసుకువచ్చిన ఘనచరిత్ర గిడుగు రామమూర్తి గారిది అని సమాచార శాఖ పౌర సంబంధాల అధికారి మిట్టపల్లి రవికుమార్ గిడుగు రామమూర్తి గారి సేవలను శ్లాఘించారు. తెలుగు మాధ్యమ వికాసానికి, తెలుగు విద్యా బోధనకు గిడుగు రామమూర్తి గారి వ్యవహారిక భాషోద్యమమే పునాది అని తెలుగు పండితులు వెంకటరమణ గారు వివరించారు. కార్యక్రమంలో విశ్రాంత పోస్ట్ మాస్టర్ లక్ష్మయ్య, సుదీక్ష కార్యదర్శి చిట్టిబాబు, సుదీక్ష సభ్యులు సునీత, సుకీర్తి రాజీవి పాల్గొన్నారు.