మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి:ఎస్టీయూ
1 min readపల్లెవెలుగు, పత్తికొండ: మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్టియు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి . ఆదివారం కర్నూలు జిల్లా పత్తికొండ ఎస్టియు కార్యాలయంలో మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. 2008 డీఎస్సీ అభ్యర్థులను ఒప్పంద ప్రాతిపదికన మినిమం టైం స్కేల్ వేతనంతో రాష్ట్ర వ్యాప్తంగా 2300 మందిని ప్రభుత్వం నియమించింది. ఉపాధ్యాయులు విధుల్లో చేరి మూడు నెలలు కావస్తున్నా ఇంత వరకు వేతనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు వ్యయ, ప్రయాసలకోర్చి మూడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారని, వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగులో ఉన్న మూడు నెలల వేతనాలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఎస్టియు రాష్ట్ర కౌన్సిలర్, ఎస్టియు జిల్లా సబ్ కమిటీ కార్యదర్శి సుంకన్న హాజరయ్యారు.