వ్యాక్సిన్ వేయించుకున్నా.. కరోన ఎందుకు సోకుతోంది ?
1 min readపల్లెవెలుగువెబ్ : దేశ వ్యాప్తంగా కరోన వ్యాక్సిన్ రెండు డోసుల కార్యక్రమం చాలా వరకు పూర్తయింది. ఇప్పటికే మెజార్టీ ప్రజలు వ్యాక్సిన్ స్వీకరించారు. అయినప్పటికీ కరోన వైరస్ సోకుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే అంశం పై అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు పలు కీలక అంశాలను గుర్తించారు. వైరాలజీ ప్రొఫెసర్ షాన్ లూల్యూ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం రూపొందించిన పరిశోధనా పత్రం ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో ప్రచురితమైంది. టీకా తీసుకున్న తర్వాత మానవ రోగ నిరోధక వ్యవస్థ చైతన్యవంతం అవుతుంది. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే అడ్డుకునేందుకు సర్వ సన్నద్ధమై ఉంటుంది. అయినా మానవ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రయత్నంలో కరోనా వైరస్ సఫలమవడానికి ప్రధాన కారణం.. దాని వ్యాప్తి విధానమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ శరీరంలోని ఒక కణం నుంచి మరో కణానికి కరోనా వైరస్ అంతర్గతంగా వ్యాప్తి చెందుతున్న తీరు వల్లే.. దాన్ని రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీలు సైతం బంధించలేకపోతున్నాయని వెల్లడించారు.