గోపూజ, గోవింద నామస్మరణతో మార్మోగిన ప్రాత:కోట
1 min readపల్లెవెలుగు వెబ్: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రాతకోట గ్రామంలోని శ్రీకాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం నందు గత ఐదు రోజుల నుండి జరుగుతున్న ధార్మిక ప్రవచనాలు, భజనలు, గోపూజ, కుంకుమార్చనలు, నగర సంకీర్తనలతో గోవిందనామ స్మరణతో గ్రామం మార్మోగిపోయింది. మూడు రోజులపాటు సాగిన ధర్మాచార్యులు ఆమంచి వేంకటేశ్వర్లు రామాయణ, మహాభారత, భగవద్గీత ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరిరోజు గోమాతను ఊరేగింపుతో గోపూజ, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మంలో ప్రతి ఆచారం వెనుక ఎంతో శాస్త్రీయత ఉన్నదన్నారు.
మహర్షులు మనకందించిన ఋషి ధర్మాన్ని అనుసరించడమే దేశానికి, ప్రపంచానికి హితకరమని చాటారు. ప్రపంచంలో సర్వేజన సుఖినోభవంతు అని కోరుకునే భారతీయ ఋషిపరంపరను గుర్తుంచుకున్నంత కాలం ఈ ప్రపంచానికి మనదేశం విశ్వగురుస్థానంలోనే ఉంటుందని చాటారు. ప్రపంచంలో ఏ సాహిత్యానికీ లేనంత గొప్పతనం మన ఇతిహాసాలకున్నదన్నారు. పాశ్చాత్య అనుకరణ ఈదేశానికి గాని మనకు గాని ఏవిధంగా కూడా శ్రేయస్కరం కాదని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి శేషమ్మ నాగ శేషులు ,మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రమేష్ నాయుడు మాజీ సర్పంచ్ భాస్కర్, ధర్మ ప్రచార మండలి సభ్యులు ఎ.శివ శంకర రెడ్డి , నాగేశ్వర రెడ్డి , హార్మోనిస్టు సుబ్బయ్య, తబలిస్టు నర్సన్న ,భజన మండలి సభ్యులు శివరాముడు, రామకృష్ణ, లావణ్య, సరస్వతమ్మ , రాములమ్మ, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.