16 జిల్లాల్లోనూ..వాల్మీకులకు ఎస్టీ హోదా కల్పించాలి
1 min read– దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలుగా కొనసాగుతున్నా… ఏపీలోని 16 జిల్లాల్లో బీసీలుగా…
– బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విన్నవించిన ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ వాల్మీకులు ఎస్సీ, ఎస్టీ హోదాలో కొనసాగుతున్నాని, ఏపీలోనూ కొత్తగా ఏర్పడిన10 జిల్లాల్లోనూ ఎస్టీలుగా పరిగణించబడుతున్నారని, కానీ మిగిలిన 16 జిల్లాలో మాత్రం బీసీలుగా ఉన్నారని , వారికి కూడా ఎస్టీ హోదా కల్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కోరారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి. బుధవారం డా. పార్థసారధితో పాటు ఈశ్వరయ్య గారు , రామచంద్ర గారు, ప్రొఫెసర్ జగదీష్ గారు , హనుమంతప్ప తదితరులు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిసి.. వాల్మీకుల సమస్యను విన్నవించారు. ఒకప్పుడు ఎస్టీలుగా ఉన్న వారిని 1968 సం। లో రాయలసీమ జిల్లాల్లో బీసీలుగా హోదా మార్చి అన్యాయం చేశారు. ఎటువంటి కుల వృత్తి లేకుండా , జీవనోపాధి లేకుండా పేదరికాన్ని అనుభవిస్తున్నామని, ఇక్కడి వాల్మీకులను మిగతా జిల్లాలు మరియు రాష్ట్రాలతో సరిసమానంగా ST హోదా కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నామన్నారు. పక్క రాష్ట్రం కర్నాటక లో కూడా వాల్మీకులు రాజ్యాంగబద్ధంగా ఎస్టీ హోదాలో ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్తగా ఏర్పడిన 10 జిల్లాల్లో ఎస్టీలుగా పరిగణించబడుతున్నారని, మిగిలిన 16 జిల్లాల్లో మాత్రమే బీసీలుగా ఉండటం అన్యాయమన్నారు. ఈ న్యాయమైన డిమాండ్ తో దశాబ్దాలుగా రాయలసీమలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. వాల్మీకులకు ఎస్టీ హోదా తిరిగి కల్పించాలని కోరగా.. ఇందుకు స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వాల్మీకుల ఎస్టీ హోదా విషయమై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.