PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పవన్ కల్యాణ్ కు బీజేపీ పెద్దల పిలుపు..?

1 min read

విశాఖపట్నం లో అధికార వైసీపీ , జనసేన పార్టీ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల తర్వాత ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి.

విశాఖ ఎయిర్ పోర్ట్ ఇష్యూ తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్ ఆవేశపూరిత ప్రసంగం.., ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ బీజేపీకి చురకలంటించడం సంచలనంగా మారింది. పవన్ కామెంట్స్ నేపథ్యంలో అలర్ట్ అయిన బీజేపీ అధిష్టానం.. జనసేనానిని ఢిల్లీకి రావాల్సిందిగా కబురుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యేక విమానంలో పవన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

పవన్ ఢిల్లీలో ఎవరెవర్ని కలుస్తారు.. ఏయే విషయాలు చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును పిలిపించుకున్న అధిష్టానం కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు పవన్ ను కూడా పిలవడంతో రెండు పార్టీల పొత్తు విషయంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మంగళవారం చంద్రబాబు.. పవన్ ను కలవడంతో టీజీపీ, జనసేన పొత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. పవన్ బీజేపీ నుంచి విడిపోయి టీడీపీతో కలుస్తారన్న ప్రచారం జరిగింది. ఇదే సమయంలో కేంద్రం నుంచి పిలుపురావడంతో రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఇప్పుడు పవన్ బీజేపీతో కంటిన్యూ అవుతారా.. లేక టీడీపీతో పాటు పయనిస్తారా అనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరోవైపు పవన్ తో చంద్రబాబు భేటీ కేవలం రాజకీయపరంగా మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని.. ఇందులో పొత్తుకు సంబంధించిన అంశాలేవీ చర్చకు రాలేదని జనసేన వర్గాలు అంటుండగా.. టీడీపీ నేతలు మాత్రం పొత్తుకు ముందడుగు పడిందన్న భావనలో ఉన్నారు. మరోవైపు అధికార వైసీపీ మాత్రం పవన్, బాబు భేటీపై మండిపడుతోంది. ఇన్నాళ్లూ తెరవెనుక రాజకీయాలు చేసిన పవన్, చంద్రబాబు.. ఇప్పుడు ఓపెన్ అయ్యారని.. పవన్ నిజంగానే బాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నారనడానికి ఇదే ప్రూఫ్ అని ప్రచారం చేస్తున్నాయి. ఐతే పవన్ ఢిల్లీ వెళ్లారన్న వార్తలపై జనసేన పార్టీ వర్గాలు ఇంకా స్పందించలేదు.

About Author