PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్నవ‌య‌సులోనే బ్రెయిన్ స్ట్రోక్స్

1 min read

వ‌ర‌ల్డ్‌ స్ట్రోక్ డే- అక్టోబ‌ర్ 29న‌
డాక్టర్‌. సుమంత్ కుమార్‌క‌న్సల్టెంట్ ,న్యూరోస‌ర్జన్‌,కిమ్స్ హాస్పిట‌ల్, క‌ర్నూలు.
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ఇటీవ‌ల కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా స్ట్రోక్స్ వ‌స్తున్నాయి. ఈ స్ట్రోక్స్‌నే మెద‌డు వాతం అంటారు. ఈ వ్యాధిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉంది. ప్రతి ఒక్క‌రికి ఈ వ్యాధిపై అవ‌గాహ‌న ఏర్ప‌డిన‌ప్పుడే వ్యాధిని ఆదిలోనే గుర్తించి చికిత్స చేయ‌వచ్చు. ఇందుకోసం ప్ర‌తి సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 29న వ‌రల్డ్ స్ట్రోక్ డేని నిర్వ‌హిస్తారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి విసృత్తమైన ప్ర‌చారం చేస్తారు. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఒక‌ప్పుడు 60-70 ఏళ్ల వ‌య‌సులో వ‌చ్చేది. ప్ర‌స్తుతం యువ‌త‌లో ఎక్కువ మంది దీని బారిన ప‌డుతున్నారు. మారుతున్న జీవ‌న‌శైలి, ఒత్తిడి, జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల‌తో చిన్న వ‌య‌సులోనే స్ట్రోక్‌కు గుర‌వుతున్నారు. ఇత‌ర బాధితుల్లో 30 శాతం మంది శాశ్వ‌త వైక‌ల్యానికి గురవుతున్నారు. 30-45 ఏళ్ల మ‌ధ్య యువ‌త 15 శాతం వ‌ర‌కు ఉంటున్నార‌ని నివేదికలు చెబుతున్నాయి. మ‌స్తిష్క ర‌క్తనాళాల్లో ఏర్ప‌డే వైఫ‌ల్యం కార‌ణంగా ర‌క్తం గ‌డ్డక‌ట్టడం ద్వారా అవి పూర్తిగా లేదా పాక్షికంగా మూసుక‌పోతాయి. మెద‌డుకు ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌ర‌గ‌పోయినా.. ఈ స్ట్రోక్స్ వ‌స్తాయి.
మారుతున్న జీవ‌న‌శైలి ప్రధాన కారణం: న‌గ‌రంలో ఉరుకులు ప‌రుగుల జీవన‌మే. ప‌లువురు వృత్తిప‌రంగా, వ్యక్తిగ‌తంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు నివేదిక‌లు వెల్లడిస్తున్నాయి. తాతాల్కిక ఉప‌శ‌మ‌నం కోసం కొంద‌రు ధూమ‌పానం, మ‌ద్య‌పానం, ఇత‌ర మ‌త్తు మందుల‌కు అల‌వాటు ప‌డుతున్నారు. వీటికి బానిస‌లుగా మారుతుండ‌డంతో నాడీ వ్య‌వ‌స్థ‌ని ఇవి దెబ్బతీస్తున్నాయి. వారంలో 3-4 సార్లు చాలా మంది బ‌య‌ట ఆహారం తీసుకుంటున్నారు. ఇందులో ఎక్కువ శాతం కొవ్వులు శ‌రీరంలోకి చేరుతున్నాయి. ఎలాంటి శారీర‌క వ్యాయామం లేక‌పోవ‌డం వ‌ల్ల చివ‌రికి అధిక బ‌రువుకి దారితీస్తోంది. అధిక కొవ్వుల‌తో ఊబ‌కాయం వ‌చ్చి అధిక ర‌క్తపోటు, మ‌ధుమేమం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. చెడు కొల‌స్ట్రాల్ పెరుగుతోంది. ఇవ‌న్నీ క‌లిసి చివ‌రికి బ్రెయిన్ స్ట్రోక్ ద‌శ‌కు చేరే అవ‌కాశం ఉంది. న‌గ‌రంలో చాలా మందికి శారీక శ్ర‌మ ఉండ‌డం లేదు. చిన్న‌వారి నుండి పెద్దవారి వ‌ర‌కు ఇదే స‌మ‌స్య‌. ఉద‌యం లేచి నుండి ఆఫీసులు, ప‌నులు అంటూ తిర‌గ‌డమే త‌ప్పా… శ‌రీరం కోసం స‌మ‌యాన్ని కేటాయించ‌లేక‌పోతున్నారు.
మెద‌డులో ర‌క్తప్రస‌ర‌ణ ఆగిన‌చోటుపై బ్రెయిన్ స్ట్రోక్ ల‌క్షణాలు ఆధార‌ప‌డి ఉంటాయి. మెద‌డులోని కాళ్లు, చేతులను నియంత్రించే భాగాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా ఆగితే ఆ భాగాలు చ‌చ్చుబ‌డిపోతాయి.
ముఖం, నోరు, క‌న్ను ఒక్కోసారి శ‌రీరానికి ఇరువైపులా ఉన్న భాగాలు ప్రభావితం కావ‌చ్చు. మాట ప‌డిపోవ‌డం, నిల‌క‌డ‌గా స్థిమితంగా లేక‌పోవ‌డం, చూపు, సృహ కోల్పొవ‌డం జ‌రుగుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే త‌క్షణం బ్రెయిన్ స్ట్రోక్‌గా భావించి వెంట‌నే చికిత్స అందించాలి.
అధిక మొత్తంలో ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించాలి. రోజుకు మూడు-నాలుగు గ్రాముల‌కు మించ‌క‌పోవ‌డం ముఖ్యం. రోజులో క‌నీసం 45 నిమిషాల పాటు, వారానికి 5 రోజుల పాటు వేగ‌వంతంగా న‌డ‌వాలి. సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, ష‌టిల్‌, టెన్నిస్‌, వంటి ఆట‌లు ఆడ‌డం మంచిదే. రోజువారీ ఆహారంలో పండ్లు, కూర‌గాయాలు 40 గ్రాముల‌కు త‌గ్గ‌కుండా చూసుకోవాలి. క‌నీసం 3-4 లీట‌ర్లు నీళ్లు తాగాలి.
విట‌మిన్ -డి లోప‌మూ కూడా
విటమిన్ డి లోపం కూడా చివరికి బ్రెయిన్ స్ట్రోక్‌కి కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. విట‌మిన్-డి, విట‌మిన్- బి12 లోపంతో ర‌క్తంలో అమినో యాసిడ్ త‌గ్గుతుంది. ఇది చివరికి బ్రెయిన్ స్ట్రోక్‌కి కార‌ణ‌మ‌వుతోంది. ఉద‌యం ఎండ‌లో విట‌మిన్‌-డి పుష్క‌లంగా ల‌భ్య‌మ‌వుతుంది. చేప‌లు ఇత‌ర ఆహార ప‌దార్థాల్లో త‌క్కువ మోతాదులో ఉంటుంది. రాత్రి విధులు, లేట్ నైట్ పార్ట‌ల‌తో, చాలా మంది ఉద‌యం ఎండ‌కు దూరంగా ఉంటున్నారు.
ఈ వ్యాధికి ఎంత త్వరితంగా చికిత్స అందిస్తే అంత త్వ‌ర‌గా కోలుకోవ‌డ‌నాకి ఆవకాశం ఉంటుంది. దీన్ని గోల్డెన్ అవ‌ర్ అంటారు. ల‌క్షణాలు బ‌ట్టి వెంట‌నే ఆసుపత్రికి త‌ర‌లించాలి. మెద‌డు ర‌క్తనాళాల్లో ఏర్పడిన పూడిక‌ను తొల‌గించ‌డాటినికి చికిత్స అందించాలి. ఫిజియోథెర‌పీ, స‌రైన చికిత్స‌తో పలువురు కోలుకునే అవ‌కాశం ఉంది. ఆల‌స్యం చేసే కొద్ది చికిత్స అనేది సంక్లిష్టంగా మారుతుంది. ఒక్కోసారి ప్రాణానికే ఆపాయం క‌ల‌గ‌వ‌చ్చు.

About Author