రెండు కోట్ల విలువ చేసే ఆస్తి ప్రభుత్వానికి దానం
1 min read– మానవత్వాన్ని మించిన సేవ మరొకటి లేదు
– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు : నియోజకవర్గంలో సమాజాభివృద్ధిలో దాతల సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. దెందులూరుకు చెందిన మొటపర్తి వెంకట్ మరియు శ్రీమతి మొటపర్తి రామచంద్రమ్మలు 2 కోట్ల రూపాయలు విలువచేసే తమ ఆస్థి అయిన భవనాన్ని మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం ఆ శాఖకు దానంగా ఇస్తూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులకు భవనం తాలూకా పత్రాలను శనివారం దెందులూరు లో అందించారు. ఇందుకు సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను శనివారం పూర్తి చేసి, సంబంధిత పత్రాలను ఐ సి డి ఎస్ అధికారులకు అందించారు. అంతేకాక మహిళలు, బాలల ఆరోగ్య సంరక్షణకు మారుతీ ఓమ్ని అంబులెన్సు వాహనాన్ని కూడా వారు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మొటపర్తి వెంకట్ మరియు శ్రీమతి మొటపర్తి రామచంద్రమ్మ లను అభినందిస్తూ దుశ్శాలువా, మెమెంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మాట్లాడుతూ మానవత్వాన్ని మించిన సేవ మరొకటి లేదని, మొటపర్తి వెంకట్ మరియు శ్రీమతి మొటపర్తి రామచంద్రమ్మలు తమ ఆస్తిని సమాజహితం కోసం దానంగా ఇవ్వడం గొప్ప విషయమన్నారు. సమాజం మనకు ఏమి ఇచ్చింది అనికాకుండా సమాజానికి మనం ఏమి చేసాం అనే విషయానికి మొటపర్తి వెంకట్ మరియు రామచంద్రమ్మలు ఆదర్శంగా నిలుస్తారన్నారు. వీరు ఈ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఈ కుటుంబానికి గ్రామంలో మంచి పేరు ఉందన్నారు. మన తరువాత మన పేరును నిలబెట్టేది మనం చేసే మంచిపనులు, మనం సమాజానికి చేసిన సేవ మాత్రమేనని, దాతల పేర్లు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ప్రతీ ఒక్కరు దానగుణం కలిగి తమకు ఉన్నదాంట్లో కొంతమొత్తాన్నీ సమాజ సంక్షేమానికి వినియోగించేందుకు దాతలుగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొటపర్తి వెంకట్ మరియు రామచంద్రమ్మలు, ఆ ప్రాంతంలోని పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మొటపర్తి వెంకట్ మరియు రామచంద్రమ్మలు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడం కన్నా గొప్ప పని ఏమీ లేదన్నారు. తాము అందించిన భవనాన్ని, వాహనాన్ని స్త్రీ, శిశు సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు.కార్యక్రమంలో తహసీల్దార్ నాంచారయ్య, ఎంపిడిఓ లక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ కె. గాయత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉమారాణి, ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ అధికారి కె.వి.ఎల్. పద్మావతి, జిల్లా బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి, బాలల సంరక్షణాధికారి రాజేష్, ప్రభృతులు పాల్గొన్నారు.