జోరుగా రియల్ దందా..!
1 min read– తూతుమంత్రంగా అక్రమ లేఅవుట్ కూల్చివేతలు
– రియల్టర్లపై మున్సిపల్ అధికారుల ఉదాసీనత
– నోటీసులతో సరిపుచ్చుతున్న అధికారులు
– రియల్టర్లకు రాజకీయ నాయకుల అండ..?
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ లో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. కొందరు స్వార్థపరులు వ్యవసాయ భూముల్లో లే అవుట్లు వేస్తూ అక్రమాలకు పాల్పడుతూ తమ దందాను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీస్థాయిలో గండి పడుతోంది.మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే రియల్ వ్యాపారులు జోరుగా పంట భూములను లేఅవుట్లు గా మార్చి అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు. పట్టణంలో రియల్ దందా జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ల్యాండ్ కన్వర్షన్ చేయకుండానే క్రియ విక్రయాలు జరుపుతున్నారు.నందికొట్కూరు మున్సిపాలిటీ లోని పగిడ్యాల రోడ్డు, కొణిదెల రోడ్డు, నంద్యాల, ఆత్మకూరు, కర్నూలు, అల్లూరు, నాగలూటి , హాస్పిటల్ రహాదారి వెంట పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే ప్లాట్లు వేసి అమ్మడానికి రియల్ వ్యాపారులు సిద్ధం చేసుకున్నారు. ఇందులో కొన్ని సర్వే నెంబర్లలోనిప్లాట్ల యజమానులకు మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా అందజేశామని చెపుతున్నారు.
ప్రజలను బురిడి కొట్టిస్తూ…
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణ కేంద్రంలో ఓ నాన్ లే అవుట్ వెంచర్‌తో నిర్వాహాకులు బురిడి కొట్టిస్తున్నారు.జగనన్న కాలనీకి అత్యంత చేరువలో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని కొనుగోలుదారులకు ఎలాంటి అనుమతుల్లేని వెంచర్ ప్లాట్లను అంటగట్టేస్తున్నారు.పట్టణ పరిధిలోని ఒక సర్వే నెంబర్ లో సుమారు మూడెకరాల విస్తీర్ణంలో ఓ నాన్ లే అవుట్‌ను ఏర్పాటు చేశారు. పగిడ్యాల, నందికొట్కూరు , కొణిదేల, కర్నూలు ప్రధాన రహదారిపై ఆనుకుని ఉన్న ఈ వెంచర్లకు ఎలాంటి అనుమతుల్లేకపోవడం గమనార్హం. కొన్ని వెంచర్‌లో స్వయంగా ఓ ప్రజా ప్రతినిది భాగస్వామిగా ఉన్నట్లుగా తెలుస్తుండటం గమనార్హం. మున్సిపాలిటీ లోని జగనన్న కాలనీ సమీపంలో ఉన్న ఒక వెంచర్‌కు అనుమతుల్లేవని తెలిసినా మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించకుండా ఉదాసీనతగా వ్యవహరిస్తుండటం గమనార్హం.
కుళాయి పేరుతో ప్లాట్ల అమ్మకాలు…!
నందికొట్కూరు పట్టణంలోని నాగలూటి రహదారి పక్కన సుమారు మూడున్నర ఎకరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్‌లో దాదాపు 30 ఫీట్ల రోడ్డుతో 42 ప్లాట్లు చేశారు. గజం భూమిని రూ.14 వేల నుంచి 16 వేల మధ్య విక్రయిస్తున్నారని సమాచారం. ఇప్పటికే సగం వరకు ప్లాట్లను విక్రయించినట్లుగా తెలుస్తోంది. వెంచర్ నిర్వాహాకులు కనీసం భూమి కన్వర్షన్ కూడా చేయకపోవడం గమనార్హం. రోడ్లేస్తాం.. విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.. డ్రెయినేజీ మాత్రం మీరే నిర్మించుకోవాలంటూ నమ్మబలుకుతున్నారు. కుళాయి ఏర్పాటు కోసం మున్సిపాలిటీ లో డిపాజిట్ చేసుకుంటే ఇంటి నిర్మాణానికి పర్మిషన్లు ఈజీగానే వస్తాయని చెబుతుండటం విశేషం. గత కొద్దిరోజులుగా నిర్వాహాకులు యథేచ్ఛగా ఈ దందా సాగిస్తున్నా మునిసిపల్ అధికారులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
మున్సిపాలిటీ ఆదాయానికి గండి..!
మున్సిపాలిటీ కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి మూలంగా పట్టణ ప్రాంతాలోని భూములకు డిమాండ్ ఏర్పడింది.పట్టణంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్న వారి సంఖ్య గత మూడు నాలుగు సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది. ఈ భూమిని క్యాష్ చేసుకునేందుకు రియల్టర్లు మోసాలకు తెగబడుతున్నారు. అక్రమ లేఅవుట్లను అడ్డుకోగలిగితే పర్మిషన్ల పొందే రూపంలో మున్సిపాలిటీ కి ఆదాయం గణనీయంగా సమకూరే అవకాశం ఉన్న అధికారులు మాత్రం మిన్నకుంటున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, కొంతమంది రియల్టర్లు ఇవ్వజూపుతున్న అమ్యామ్యాలకు ఆశపడి నిబంధనలకు పూర్తిగా నీళ్లొదిలేశారన్న విమర్శలు మున్సిపాలిటీ అధికారులపై వినిపిస్తున్నాయి.
అక్రమ లేఅవుట్ కు బ్యాంక్ రుణాలివ్వరు..
అక్రమ లేఅవుట్లతో మున్సిపాలిటీ ఆర్థికంగా నష్టపోతుంది. లేఅవుట్‌లో సామాజిక అవసరాల కోసం పది శాతం ఖాళీ స్థలాన్నీ వదలకుండా అమ్మేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ లేఅవుట్లలో కొన్న ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతులు రావు. పట్టణాభివృద్ధి సంస్థలు లేఅవుట్ ప్లాను (ఎల్‌పీ) నంబరు కేటాయించని కారణంగా బ్యాంకులు కూడా రుణాలివ్వడం లేదని దీంతో కొన్నవారు తీవ్ర అవస్థలు పడుతున్నారని సమాచారం .అక్రమ లేఅవుట్ అని తెలిసి నిర్మాణాలకు బ్యాంకు రుణాలు రాక కొన్నవారు వాపోతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు కోకొల్లలుగా వస్తున్నాయి.
యజమానుల అడ్రస్ దొరకడం లేదంటా…
మున్సిపాలిటీ పరిధిలో చాలా నాన్ లే అవుట్లను వెలిశాయి. కానీ క్షేత్రస్థాయిలో భూ యజమాని ఒకరు, రియల్ వ్యాపారులు వేరేలా ఉంటున్నారని మున్సిపాలిటీ అధికారుల వాదన. దీంతో ఎవరిపై చర్యలు తీసుకోవాలో అర్థం కావడం లేదని ఇప్పటి వరకు మునిసిపాలిటీ పరిధిలో 40 దాకా వెంచర్లను గుర్తించామని వారందరికీ నోటీసులు జారీ చేయడం జరిగిందని చెపుతున్నారు. కానీ, చర్యల్లేమీ తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అక్రమమేనని తెలిశాక కూడా ఏవో సాకులు చూపుతూ వెంచర్లను ధ్వంసం చేయకుండా నోటీసులతో సరి పుచ్చడం, అధికారులు మీనమేషాలు లెక్కించడం, ఉదాసీనత వైఖరిని ప్రదర్శించడం వారి పనితీరును తేటతెల్లం చేస్తోంది.
అక్రమ లేఅవుట్ వేసిన వారిపై చర్యలు..
మున్సిపల్ కమిషనర్ పి.కిషోర్.
అక్రమంగా లేఅవుట్లు వేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటా మని కమిషనర్ పి.కిషోర్ తెలిపారు. ఇప్పటికే అక్రమ లేఅవుట్ యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. అక్రమ లేఅవుట్లు వేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమ లే అవుట్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.