గాలి నాణ్యతను మెరుగుపరచడానికి కార్యాచరణ…
1 min read– వాయుకాలుష్య నివారణ చర్యలు
– నిర్మాణ వ్యర్ధాలు ఎక్కడపడితే అక్కడ పడవేస్తే భారీ పెనాల్టీ
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్.
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు నగర వాసులకు స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణాన్ని అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన కాలుష్య నియంత్రణ మండలి, నగరపాలక సంస్ధ, రవాణా, పోలీస్, అటవీ, పరిశ్రమలు, ఎన్ హెచ్ తదితర అధికారులతో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం(ఎన్ సిఎపి) జిల్లాస్ధాయి అమలు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ నగరంలో వాయు కాలుష్య నియంత్రణ కార్యక్రమాలు చేపట్టేందుకు ఏలూరు నగరపాలక సంస్థకు ముందస్తుగా సుమారు 4 కోట్ల రూపాయలు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో నగరంలో చేపట్టిన,చేపట్టబోయే పనులపై సమీక్షించడం జరిగింది. నగరంలో పాత బస్టాండు, ఎఎస్ఆర్ స్టేడియం, జూట్ మిల్ సెంటర్, గూడ్స్ షెడ్ జంక్షన్, బిర్లా సెంటర్, కండ్రికగూడెం, తంగెళ్లమూడి, విజయవిహార్ సెంటర్, శాంతినగర్, ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఎక్కవగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఈ దృష్ట్యా పౌరులకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు తీసుకోవలసిన చర్యలను సమావేశంలో చర్చించారు. వాయు కాలుష్య స్థాయిని 20 నుండి 80 శాతం వరకు తగ్గించి, గాలిలో నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు. కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు ఏలూరు నగరంలో వాయు కాలుష్యం పెరుగుటకు కారణాలు, నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. శాంతినగర్ వై.జంక్షన్, జూట్ మిల్, పాత బస్టాండు దగ్గర, వాటర్ ఫౌంటెన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆశ్రమం ఆసుపత్రి నుంచి కలపర్రు టోల్ గేట్ వరకు జాతీయ రహదారి డీవైడర్ పై గ్రీన్ బెల్ట్ నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. శాంతినగర్ ప్రాంతంలో ప్లాంటేషన్ గార్డినింగ్ పై సోషల్ ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జూట్ మిల్ వద్ద కృష్ణాకాలువ బండ్ పై పార్క్ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. గూడ్ షెడ్ వద్ద, ఏలూరు రైల్వే ప్లాట్ ఫ్లామ్ పై వెట్ మ్యాపింగ్ చేయాలన్నారు. ఏలూరు నగర ముఖద్వారాలైన ఆశ్రమం ఆసుపత్రి వద్ద, కలపర్రు సమీపంలోని ఎస్వి రంగారావు విగ్రహం ప్రాంతాల్లో గోతులను పూడ్చి గ్రీనరీ పెంచేందుకు ఎన్ హెచ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించే కార్యక్రమంలో భాగంగా నగరంలో ఉన్న ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించి వాటిని సి.ఎన్ .జి వాహనాలుగా మార్పు చేసేలా అవగాహన కార్యక్రమం నిర్వహించాలని రవాణాశాఖాధికారులను ఆదేశించారు. సిఎన్ జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు,సిఎన్ జి ఆటో లు సమకూర్చుకునేందుకు డ్రైవర్లకు వెసులు బాటు కల్పించే దిశగా సంబంధిత అధికారులు పరిశీలన చేయాలన్నారు. జన్మభూమి పార్కులో గ్రీనరీ, వాటర్ ఫౌంటేన్ కు సంబంధించిన పనులు చేపట్టాలన్నారు. అదే విధంగా విజయ డైరీ, మరో ప్రాంతంలో పుడ్ పార్క్ పనులను సోమవరం లోపు ప్రారంభించాలన్నారు. బుద్దాపార్క్ లో ఫౌంటేన్ అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలన్నారు. నిర్మాణ వ్యర్ధాలు ఎక్కడపడితే అక్కడ పడవేస్తే భారీ పెనాల్టీ… ఏలూరు నగరంలో ముఖ్యంగా తమ్మిలేరు ,తంగెళ్లమూడి, ఏలూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గోదావరి కాలువగట్లపై ఇష్టానుసారం నిర్మాణ వ్యర్ధాలు పడవేసే వారిని గుర్తించి భారీగా పెనాల్టీ విధించడంతోపాటు సంబంధిత వాహనాలు సీజ్ చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ఇటవంటి చర్యలకు పాల్పడే వారిని గుర్తించేందుకు సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. వారానికి ఒకసారి సంబంధిత సిసి కెమేరాలో నమోదైన చిత్రాలను రవాణా, పోలీసు శాఖ అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో కాలుష్యనియంత్రణ మండలి ఇఇ కె. వెంకటేశ్వరరావు, నగర మున్సిపల్ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, డిఎస్పీ పైడేశ్వరరావు, ట్రాఫిక్ సిఐ దుర్గాప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పి. ఏసుదాసు, డిటిసి కె. శ్రీహరి, డిఎఫ్ఓ యం. హిమ శైలజ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై. రామకృష్ణ, నెడ్ క్యాప్ డియం డివి ప్రసాద్, పలువురు ఎన్ హెచ్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.