అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా నివాళి!
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: AIDSO ( ఆల్ ఇండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్) కర్నూల్ నగర కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా కర్నూల్ నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల ఎదుట ఉన్న గ్రౌండ్ నందు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమానికి ఏఐడీఎస్ఓ నగర కార్యదర్శి హెచ్.మల్లేష్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన AIDSO రాష్ట్ర అధ్యక్షులు వి. హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ – “ఒక మనిషిని మరొక మనిషి ఒకజాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? ఇకపై చెల్లదు!” అంటూ దోపిడీ పీడనలను ప్రశ్నించి తిరుగుబాటు బావుటాను ఎగరేసిన మహోజ్వల పోరాటాలు, సామాన్యులను సాహస వీరులుగా మార్చిన వీరోచిత ఘట్టాలు ప్రతి దేశ చరిత్రలోనూ నిక్షిప్తమై ఉన్నాయన్నారు. నిరంకుశ పరిపాలనను ప్రశ్నించడానికి కూడా ఊహించని పరిస్థితుల్లో సైతం గుండెబలంతో, మొక్కవోని ధైర్యసాహసాలతో ఎదిరించి ప్రాణాల్ని కూడా అలవోకగా అర్పించిన మహావ్యక్తులే ఆ దేశ విప్లవ వీరులుగా కీర్తించబడ్డారని తెలియజేశారు. తమది రవి అస్తమించని సామ్రాజ్యమని, తామే భువికధినాధులమని తమ్ముతాము ప్రకటించుకొన్న బ్రిటీష్ సామ్రాజ్యవాదుల దోపిడీ వ్యవస్థను కూకటి వేళ్ళతో సహా పెకిలించివేయడానికి తిరగబడ్డ మహా వీరులెందరో మనదేశ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో కనిపిస్తారని గుర్తు చేశారు. అత్యంత నికృష్ట దోపిడీకి గురికాబడి, నాగరికతకు అభివృద్ధికి దూరంగా, సామాజిక జీవన ప్రవాహానికి వెలుపల జీవించే గిరిజన ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన విప్లవ జ్యోతే అల్లూరి సీతారామరాజని కొనియాడారు. రెండు సంవత్సరాలపాటు బ్రిటీష్ నిరంకుశ పాలనా యంత్రాంగానికి కంటికి కునుకు లేకుండా చేసి, యావత్ ఆంధ్రదేశంలో రాజీలేని పోరాటజ్వాలను రేపి, 27 సంవత్సరాల పిన్న వయస్సులోనే బ్రిటీష్ తుపాకి గుళ్ళకు ఎదురొడ్డి అమరుడయ్యాడు అల్లూరి. ఈ విప్లవ వీరుని జీవిత పోరాటం ఆంధ్రదేశ ప్రజల ధైర్యసాహసాలకు, పౌరుష ప్రతాపాలకు ప్రతీకగా నిలచి వేలాదిమంది యువతీ యువకుల్లో చైతన్య దీప్తిని రగిలించింది, నేటికీ రగిలిస్తూనే ఉందని తెలిపారు.అనంతరం అధ్యాపకులు పి. విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ – నేడు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి గడిచిన చరిత్రకు నడుస్తున్న చరిత్రకు మధ్యగల చారిత్రక సంబంధాన్ని సజీవంగా ఉంచాలంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి అని అన్నారు. లేకపోతే చరిత్ర తెలియని సంస్కార హీనులమవుతామని అన్నారు. కావున నేటి విద్యార్థులు, యువతి, యువకులు అల్లూరి లాంటి స్వాతంత్ర సమరయోధుల వీరఘాతలను తెలుసుకోవాలని చెప్పారు. ఒకవైపు కెరీరిజం, మరోవైపు అనైతిక జీవన విధానం అనే రెండు చెడు ధోరణలు యువతరాన్ని కబళిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విస్మరింప వీలులేని కర్తవ్యం ఇదే అని గుర్తు చేశారు. వారి యొక్క వ్యక్తిత్వంలోని నైతిక బలాన్ని, విశిష్ట గుణగణాలను నేటితరం విద్యార్థులు, యువతీ, యువకులు తెలుసుకొని వాటిని తమ సొంత జీవితాల్లో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే చెడు దోరలను అడ్డుకోగలమని తెలిపారు.కార్యక్రమంలో ఏఐడీఎస్ నగర అధ్యక్షులు జహీర్, నగర కోశాధికారి రామస్వామి, AIMSS నాయకులు తేజోవతి, రోజా మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.