ఎత్తిపోతల పథకం తీసుకువస్తాం -రిజర్వాయర్ వల్ల ప్రజలకు నష్టమే
1 min read– నారా లోకేష్ కు వినతిపత్రం అందజేసిన మాజీ సర్పంచ్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలోని దేవనూరు మరియు చుట్టుప్రక్క గ్రామాలలో మల్లికార్జున రిజర్వాయర్ ప్రాజెక్టు వస్తుందని వీటివల్ల ప్రజలకు మరియు రైతులకు నష్టమే కానీ లాభం అనేది ఉండదని గ్రామంలో ఉన్న సారవంతమైన పొలాలు మరియు ఇండ్లు నీటిలో మునిగిపోవడం వలన ప్రజలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని వివిధ గ్రామాల ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ మల్లికార్జున ప్రాజెక్టును రద్దు చేయాలని ప్రాజెక్టును రద్దు చేయని పక్షంలో వివిధ గ్రామాల రైతులతో కలిసి ఉదృతం చేస్తామని దేవనూరు టిడిపి నాయకులు మరియు మాజీ సర్పంచ్ తిరునగరి నాగేంద్రుడు అన్నారు.గురువారం రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో గత రెండు రోజులుగా పర్యటించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ను మాజీ సర్పంచ్ నాగేంద్రుడు కలిసి మల్లికార్జున రిజర్వాయర్ వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మిడుతూరు మండలానికి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తే మండలంలోని అన్ని గ్రామాలలో కూడా తాగు సాగు నీరు అందుతుందని ఆయన నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తూ వినతి పత్రాన్ని అందజేశారు.టిడిపి అధికారంలోకి వస్తే మండలానికి ఎత్తిపోతల పథకం తప్పక చేయిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మాజీ సర్పంచ్ నాగేంద్రుడు తెలిపారు.ఈకార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.