ఆనందోత్సాహాల నడుమ హోరెత్తిన 100వరోజు యువగళం!
1 min readసంఘీభావంగా యాత్రలో పాల్గొన్న తల్లి భువనేశ్వరి, కుటుంబసభ్యులు
100రోజుల పాదయాత్రకు గుర్తుగా మోతుకూరులో పైలాన్ ఆవిష్కరణ
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వరోజు ప్రభంజనంలా సాగింది. శ్రీశైలం నియోజకవర్గంలో బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర జాతరను తలపించింది. టిడిపి కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ యువగళం 100వ రోజు పాదయాత్ర సాగింది. యువనేత లోకేష్ తో కలిసి తల్లి భువనేశ్వరి, నందమూరి కుటుంబసభ్యులు అడుగులు వేశారు. జైలోకేష్, జై తెలుగుదేశం నినాదాలతో యువగళం పాదయాత్ర మార్గం హోరెత్తింది. పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, 3 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో తల్లి భువనేశ్వరితో కలిసి యువనేత లోకేష్ పైలాన్ ను ఆవిష్కరించారు. 100 రోజుల పాదయాత్ర కు గుర్తుగా టిడిపి నేతలు 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఇన్చార్జి బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు జ్జాపికను యువనేతకు అందజేశారు. లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న నారా భువనేశ్వరి, కుటుంబ సభ్యులు లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి దేవన్, నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కాటమనేని దీక్షిత, కాంటమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్ తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాంప్ సైట్ లో తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, మహిళా అధ్యక్షురాలు షకీలా రెడ్డి, యువత అధ్యక్షడు పొగాకు జైరాం తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.సంతజూటూరులో చెంచు సామాజికవర్గీయులతో యువనేత సమావేశమై వారి సాధకబాధకాలు విన్నారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం సంతజూటూరు నుంచి భోజనవిరామానంతరం సంతజూటూరు నుంచి కొనసాగిన పాదయాత్రలో యువనేతతో పాటు తల్లి భువనేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లోకేష్ తో పాటు నందమూరి కుటుంబసభ్యులను చూసేందుకు జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. జనసమూహాన్ని అదుపు చేయలేక వాలంటీర్లు, యువగళం బృందాలు నానా తంటాలు పడ్డారు. దారిపొడవునా లోకేష్, తల్లి భువనేశ్వరి, నందమూరి కుటుంబసభ్యులకు జనం నీరాజనాలు పట్టారు. యువనేతకు దారిపొడవునా మహిళలు దిష్టితీసి హారతులిచ్చారు. పాదయాత్ర దారిలో మహిళలు, వృద్ధులు చెప్పిన సమస్యలను లోకేష్ ఓపిగ్గా ఆలకిస్తూ భరోసా ఇచ్చారు. పాదయాత్ర 100వరోజుకు చేరుకున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. పరమటూరు క్రాస్ వద్ద పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాదయాత్ర బండిఆత్మకూరు శివారు విడిది కేంద్రానికి చేరుకుంది.
యువనేత ఎదుట వ్యక్తమైన అభిప్రాయాలు:
వచ్చే ఆదాయం కాస్త ఫైన్లకే సరిపోతోంది!
-షేక్ ఇనయతుల్లా, బండిఆత్మకూరు
నేను ట్రావెల్స్ కు కారు కిరాయికి తిప్పుతుంటాను. డీజిల్ రేట్లు, టాక్సులు విపరీతంగా పెరిగాయి. వారంలో వివిధరకాల సాకులతో ఐదారు సార్లు ఫైన్లు వేస్తున్నారు. వచ్చే కాసిని డబ్బులు ఫైన్లకే సరిపోతున్నాయి. బాడిగలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. టిడిపి హయాంలో సబ్సిడీపై 2లక్షలు ఇస్తే కారు కొనుక్కున్నాను. పాపకు పెళ్లి చేస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు. గతంలో 200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 600 వస్తోంది. మా అబ్బాయికి బి.టెక్ పూర్తయి రెండేళ్లయింది. ఉద్యోగం లేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈ అరాచక ప్రభుత్వం పోతేనే మాలాంటి వారి బతుకులు బాగుపడతాయి.
రవాణా చార్జీలు భారంగా మారాయి
-ఇస్మాయిల్, చికెన్ షాపు యజమాని, బండిఆత్మకూరు
నేను చికెన్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. వ్యాపారం ఏమీ బాగోలేదు. డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో ట్రాన్స్ పోర్టు ధరలు పెరిగాయి. ఫారంలో 120 ఉంటే షాపుకు చేరేసరికి లైవ్ చికెన్ రూ.150 అవుతోంది. గతంలో 400 ఉండే కరెంటు బిల్లు ఇప్పుడు వెయ్యి వస్తోంది. సొంత స్థలం ఉంది కానీ, ఈ ప్రభుత్వం ఇల్లు కట్టుకోవాలంటే భయమేసి వాయిదా వేసుకున్నాను. ట్రాక్టర్ ఇసుక రూ.10వేలకు పైనే పలుకుతోంది. మా పాప ఫార్మసీ చదువుతోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ చేస్తామని చేయలేదు. దీంతో గత ఏడాది 1.70లక్షలు కట్టాను. నిత్యావసర వస్తువులు, గ్యాస్, డీజిల్ అన్ని ధరలు పెరిగాయి. సామాన్యుడు బతకడం కష్టంగా ఉంది.
ఎరవుల ధరలు విపరీతంగా పెరిగాయి
-సుబ్రహ్మణ్యం, రైతు, బుక్కాపురం
నేను 10ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. అరటి, వరిపంటలు వేస్తే గతఏడాది రూ.4లక్షలు నష్టం వచ్చింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. ఎరువులు, పురుగుమందులు ధరలు విపరీతంగా పెరిగాయి. 28:28 ఎరువు కట్ట గతంలో రూ.700 ఉంటే ఇప్పుడు 2వేలు అయింది. గత ప్రభుత్వంలో 90శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందించేవారు. ఇప్పుడు ఆ పథకం మూలనపెట్టారు. మా అబ్బాయి బి.టెక్ చదువుతున్నాడు. మా బిడ్డల భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబు సిఎం కావాలి.
ఎన్నిసార్లు అడిగినా పింఛను ఇవ్వడం లేదు
-శివయ్య, లింగాపురం
నేను వ్యవసాయ కూలీగా జీవిస్తున్నాను. బిడ్డలు పెళ్లిచేసుకొని వెళ్లిపోయారు. నాకు ఎటువంటి పొలం లేదు. బతకడానికి ఎటువంటి ఆధారం లేదు. పించనుకు దరఖాస్తు చేస్తే పట్టించుకోలేదు. వాలంటీరు, సచివాలయంలో ఎన్నిసార్లు చెప్పుకున్నా ఉపయోగం లేదు. కూలీ పని దొరికిన రోజు భోజనం ఉంటుంది. లేనిరోజు పస్తులే. నాకు పింఛను ఇప్పించండి. 50ఎకరాల పొలం ఉన్నవారికి కూడా పెన్షన్ వస్తోంది. నాలాంటి వాడికి పెన్షన్ ఇవ్వడం లేదు.