పది రోజుల పాపకు… పని చేయని అవయవాలు
1 min read– కార్డియాక్ అరెస్ట్
– నెలలు నిండకముందే తక్కువ బరువుతో పుట్టిన పాప
– కిమ్స్ సవీరా ఆస్పత్రిలో చికిత్సతో ప్రాణదానం
పల్లెవెలుగు వెబ్ అనంతపురం: పది రోజుల పసి పాప… నెలల నిండకముందే జన్మించింది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకడంతో శరీరంలోని అవయవాలన్ని దెబ్బతిన్నాయి. అంతేకాకుండా కార్డియాక్ అరెస్టు కావడం ఇంకా సంక్లిష్టంగా మారింది. సాధారణంగా గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టు అనగానే కాస్త పెద్దవయసు వాళ్లకు లేదా నడివయసు వాళ్లకు వస్తుందని అనుకుంటాం. కానీ, కేవలం 10 రోజుల వయసున్న పాపకు కార్డియాక్ అరెస్టు కావడమే క్లిష్టతరం అనుకుంటే.. సీపీఆర్ చేసి ఆ పాపను రక్షించడం మరింత విశేషం. దెబ్బతిన్న అవయవాలను ఎలా పని చేయించారో… కార్డియాక్ అరెస్టు నుంచి పాప ఎలా కోలుకుందనే విషయాలను కిమ్స్ సవీరా ఆస్పత్రికి చెందిన సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ మహేష్ వివరించారు. కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన జయమ్మ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఇటీవల పాపకు జన్మనిచ్చారు. అయితే.. నెలలు నిండకముందే తల్లికి రక్తపోటు బాగా ఎక్కువ కావడంతో ఏడో నెలలోనే సిజేరియన్ చేయాల్సి వచ్చింది. పుట్టేసరికి పాప బరువు కేవలం ఒకటిన్నర కేజీలు మాత్రమే ఉంది. కొద్దిరోజులకే పాపకు.. ఇన్ఫెక్షన్ కారణంగా గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు పనితీరు బాగా దెబ్బతిన్నాయి. ప్లేట్‌లెట్లు 9 వేలకు పడిపోయాయి. గుండెకు రక్తసరఫరా పూర్తిస్థాయిలో లేదు. ఊపిరితిత్తుల్లో నిమ్ము వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న పాపను, పది రోజుల వయసు ఉండగా కిమ్స్ సవీరా ఆస్పత్రికి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి పాపకు బీపీ కూడా తగినంతగా లేదు. పలు రకాల ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆరు రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉంచాల్సి వచ్చింది. అదే సమయంలో పాపకు కార్డియాక్ అరెస్టు అయ్యింది. దాంతో సీపీఆర్ చేసి, గుండె తిరిగి పనిచేసేలా చేశాం. సాధారణంగా అన్ని అవయవాలూ బాగున్నవారికి కార్డియాక్ అరెస్టు అయితే కాపాడగలం గానీ, ఇలా అన్ని అవయవాలూ పాడైన వాళ్లకు, అందులోనూ కేవలం పది రోజుల వయసున్న పాపకు సీపీఆర్ చేసినా కాపాడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ అదృష్టవశాత్తు ఈ కేసులో మాత్రం పాప గుండె మళ్లీ పనిచేయడం మొదలైంది. పాపను మెకానికల్ వెంటిలేషన్ మీద ఉంచి ఐనోట్రోపిక్ మందులు, రక్తం, ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ లాంటివాటితో సమగ్ర చికిత్స చేశాం. ఆరు రోజుల తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడటంతో తర్వాత వెంటిలేటర్ తీసేసి చికిత్స కొనసాగించాం. మొత్తం 20 రోజుల పాటు ఇలా చికిత్స అందించిన తర్వాత పాప పూర్తిస్థాయిలో కోలుకుంది. దాంతో డిశ్చార్జి చేశాం. భవిష్యత్తులో కూడా రెండేళ్ల వయసు నిండేవరకూ పాపను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి, పాప ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలి. ఏమాత్రం అనారోగ్యం అనిపించినా వెంటనే వైద్యులకు చూపించాలి. నెలలు నిండకముందే పుట్టిన ఈ పాపను ఎర్లీ ఇంటర్వేషన్ ప్రోగ్రాంలో చేర్చాలి’’ అని సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ మహేష్ వివరించారు. ఈ చికిత్సలో పీడియాట్రీషియన్ డాక్టర్ శ్రీరామ్ కూడా పాల్గొన్నారు.