PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐ.బి  సీలబస్ ను.ప్రవేశపెట్టాలన్న ఆలోచనను విరమించుకోండి

1 min read

– ఏపీటీఎఫ్ 

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వచ్చే  విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టాలనుకుంటున్న ఇంటర్నేషనల్  బకలారియట్ సిలబస్ ఆలోచనను విరమించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్రకార్యదర్శి నగిరి శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ( గడిగరేవుల) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు  ఏపీటీఎఫ్ గడివేముల మండల శాఖ అధ్యక్షుడు ఎల్. బాలస్వామి అధ్యక్షతన ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నగిరి. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తరచుగా సిలబస్ మార్చడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు జీవో నెంబర్ 81 విడుదల చేశారని, ఆ ఉత్తర్వులు ప్రకారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా ఏర్పడిన స్టీరింగ్ కమిటీ ప్రకారం ఇంటర్నేషనల్ బకలారియట్( ఐబి) సిలబస్ కు అనుగుణంగా ప్రతి ఏటా తరగతుల పెంపుపై అధ్యయనం చేస్తారని ఆయన అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వము నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రవేశపెట్టిందని అయితే బిజెపి పాలిత రాష్ట్రాలే ఎన్ ఈ పి నీ అమలు చేయడం లేదని, అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో పేద, బడుగు, బలహీన, దళిత వర్గాల విద్యార్థులే చదువుతున్నారని, వీరికి తెలుగు, ఇంగ్లీష్ మీడియం లలో బోధన తప్పనిసరిగా ఉండాలని అయితే ప్రభుత్వం కేవలం ఇంగ్లీష్ మీడియం ను మాత్రమే బలవంతంగా ప్రవేశ పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోతున్నారని, వారు మధ్యలో బడి మానేసి బాల కార్మికులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం నుండి స్టేట్ సిలబస్ కు బదులుగా ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తున్నారని , అంతలోనే ఇంటర్నేషనల్ బకలారియట్( ఐబి) సిలబస్ ను ప్రవేశపెట్టాలనుకోవడం ఇలా తరచుగా సిలబస్ ను మార్చడం వల్ల విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి వారు చదువు కు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని, కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ప్రజా సంకల్ప యాత్రలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చి వారి సహకారంతో ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర సంవత్సరాల తర్వాత మాట తప్పి సిపిఎస్ కన్నా ప్రమాదకరమైన గ్యారెంటీ పెన్షన్ స్కీమును ప్రవేశపెట్టడం దుర్మార్గమైన విధానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు సామాజిక భద్రత లేని గ్యారెంటీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆవుల. మునిస్వామి, మండల శాఖ ప్రధాన కార్యదర్శి మానపాటి రవి, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్. మహబూబ్ బాషా, ఏ. నాగన్న సీనియర్ నాయకులు రాంపుల్లారెడ్డి, మల్లికార్జునయ్య, ప్రతాపరెడ్డి, శ్రీరాములు, రాముడు, మారెన్న, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, లక్ష్మణ్ కుమార్, కవిత, చంద్రావతి, లక్ష్మీదేవి, ఆదిశేషమ్మ, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author