కర్నూలు జిజిహెచ్ లో మహిళలకు తప్పని తిప్పలు..!
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు (ఆర్యు): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిత్యం వందల సంఖ్యలో రోగులు పలు ప్రాంతాల నుంచి వైద్యం కోసం వస్తుంటారు. మంచి వైద్యం అందుతుందని దృష్టిలో పెట్టుకొని రోగులు ఆశతో వస్తుంటారు. కానీ కొన్ని విభాగాలలో సరైన సౌకర్యాలు లేవని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. విషయానికి వస్తే శుక్రవారం ఒక మహిళ రొమ్ము గడ్డలు ఉండడంతో వైద్యులను సంప్రదించింది. వారు అల్ట్రా సౌండ్ స్కానింగ్ తీయించుకుని రమ్మని చెప్పడంతో , ఆ మహిళ స్కానింగ్ విభాగానికి వెళ్ళింది. అక్కడ స్కానింగ్ తీయించుకోవడానికి లోపలికి వెళ్లగా ఆ మహిళ ఆశ్చర్యంతో సిగ్గుతో నిలబడిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నది, స్కానింగ్ నిర్వహిస్తున్నది, పురుషులు కాబట్టి దీనిపై ఆ మహిళ వారిని అడగగా ఇక్కడ స్కానింగ్ తీసేది పురుషులే అని వారు సమాధానం ఇవ్వడంతో , ఆ మహిళ స్కానింగ్ చేయించుకోకుండా వెను తిరిగి వచ్చింది . ఇలా ఆవేదన చెందిన మహిళా ఒక లేఖ రాసి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కంప్లైంట్ బాక్స్ లో వేసింది. ఆ లేఖలో సూపరింటెండెంట్ స్పందించి కనీసం రొమ్ము గడ్డలకు నిర్వహించే టెస్టులు మహిళా డాక్టర్లు ఉండే విధంగా చూడాలని కోరింది.