PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రిష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలి

1 min read

ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన బొజ్జా దశరథరామిరెడ్డి.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కృష్ణానది నీటి నిర్వహణకు అత్యంత కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలు లో “కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం” ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఉత్తరం ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు.గురువారం నంద్యాల సమితి కార్యాలయంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీబాగ్  ఒడంబడికను గౌరవిస్తున్నాం అని ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో ప్రకటించడాన్ని స్వాగతించామనీ  ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కడప కేంద్రంగా జనవరి 17, 2020 న పెద్ద ఎత్తున సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని  నిర్వహించామని ఈ సందర్భంగా శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో పాలనా వికేంద్రీకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రకటించిన  విధంగా వికేంద్రీకరణ చేపట్టకపోగా, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు సిఫార్సు చేయడం  రాయలసీమ వాసులకే  కాకుండా,  యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. కృష్ణా నదికి ఏ  మాత్రం సంబంధంలేని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే నిర్ణయాన్ని పునః సమీక్ష చేసి,  బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాలతో కలిసి అనేక కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. అందులో ముఖ్యమైన కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలో పొందుపరిచామన్నారు.

1. జనవరి 6, 2021 న కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం ఆద్వర్యంలో, విజయవాడ కేంద్రంగా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

2. జనవరి 9, 2021 న రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో నంద్యాల కేంద్రంగా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

3. డిసెంబర్ 13, 2021 న రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా ధర్మదీక్ష

4. జనవరి 18, 2023 న రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో నంద్యాల కేంద్రంగా ధర్మదీక్ష

5. జనవరి 2023 లో కృష్ణా నది బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ అనేక మంది శాసన, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు వ్రాసిన ఉత్తరాలను రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో సేకరించి, రాష్ట్ర ప్రభుత్వానికి చేర్చడం జరిగింది.

6. నవంబర్ 4, 2023 సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశం.

కృష్ణా నది యాజమాన్య బోర్డు అధికారులు కృష్ణా నది బోర్డు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు సరైనది కాదు అని పేర్కొన్న సందర్భంలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.

 “శ్రీబాగ్ ఒడంబడికను” గౌరవిస్తూ, “ఆంధ్రప్రదేశ్ ప్రజల నిర్ణయాన్ని” పరిగణిస్తూ, “ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూ”, కృష్ణా నది నీటి నిర్వహణకు కీలకమైన కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం  “కర్నూలు”లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని దశరథరామిరెడ్డి లేఖ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

About Author