బైరెడ్డి చేరిక ఖాయమయిందా.. ?
1 min readనందికొట్కూరులో వెలిసిన బైరెడ్డి మేము సిద్ధమే ప్లెక్సీలు..
ఆసక్తికరంగా మారిన ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వెలసిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్లెక్సీ లు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.నందికొట్కూరు పట్టణంలో ప్లెక్సీ ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నాయకులు సిద్ధం పేరుతో ప్లెక్సీ లు ఏర్పాటు చేసిన రెండు రోజులకే మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్లెక్సీ లు ఏర్పాటు చేయడంతో నందికొట్కూరు పట్టణంలో రాజకీయ దుమారం రేపుతోంది. బైరెడ్డి టీడీపీలోకి వస్తే నంద్యాల రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని పలువురు రాజకీయ సీనియర్ నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
బైరెడ్డికి రాయలసీమలో పాలోయింగ్..
ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో శాసించిన కుటుంబాల్లో బైరెడ్డి కుటుంబం ఒకటి. మాజీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి రాయలసీమలో మంచి ఫాలోయింగ్ ఉంది. నందికొట్కూరు సెగ్మెంట్‌లో 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ప్రత్యర్థి గౌరు చరితా రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో నందికొట్కూరు ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. దీంతో బైరెడ్డి, గౌరు చరితా రెడ్డిలు పాణ్యంలో పోటీ పడ్డారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2012లో టీడీపీని వీడి ప్రత్యేక రాయలసీమ గళం అందుకున్నారు. ఆ సమయంలోనే రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు.
రాయలసీమ కోసం పోరాటం..
రాష్ర్ట విభజనను తీవ్రంగా వ్యతిరేకించి ప్రత్యేక రాయలసమీ కోసం పోరాటం అందుకున్నారు. రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. ఆశించిన స్థాయిలో ప్రజాదారణ లేకపోవడంతో పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి రాయలసీమ పరిరక్షణ సమితిని భూస్థాపితం చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం 2018లో కాంగ్రెస్ పార్టీలో లో చేరారు. రాష్ర్ట విభజన కారణంతో 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. గౌరు వెంకటరెడ్డి , మాండ్ర శివానంద రెడ్డితో కలిసి పార్టీ కోసం పని చేశారు. కానీ ఆ ఎన్నికల్లో బైరెడ్డి పోటీ చేయడానికి అవకాశం దక్కలేదు. ఆ తర్వాత తన కుమార్తె డాక్టర్ బైరెడ్డి శబరితో పాటు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొంత కాలంగా రాయలసీమ వెనుకబాటుతనంపై గళమెత్తుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ర్టంలోని వైసీపీ తీరును ఎండగడుతూ పోరాటం చేశారు. రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టాలని కోరుతూ అనేక ఉద్యమాలు చేపడుతూ వచ్చారు.రాయలసీమ జిల్లాల్లో చైతన్యం కలిగించారు.
మళ్ళీ టీడీపీలోకి బైరెడ్డి..
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన మళ్లీ టీడీపీలో చేరాలనుకుంటున్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరితే జిల్లా రాజకీయ సమీకరణాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధిష్టానం బైరెడ్డికి నంద్యాల ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీ ,జనసేన ,టీడీపీ పోత్తులలో భాగంగా నంద్యాల ఎంపీగా ఉమ్మడి అభ్యర్థిగా బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శభరి పేరు అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నెల 8న టీడీపీ,జనసేన, బిజీపీ మరోసారి సమావేశం కానున్నారనేది సమాచారం. ఈ సమావేశంలో భాగంగా అభ్యర్థులను ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ పార్టీ కీలక నాయకులు ఆయన రాకను అడ్డుకుంటుండడం వల్లే టీడీపీలోకి బైరెడ్డి ఎంట్రీ సస్పెన్స్‌గా మారిందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.