చిన్న వయసులో పెద్ద చదువు
1 min read* ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డాక్టర్ కావ్యకు స్థానం
* 31 ఏళ్ల 9 నెలలకే కాలేయ వ్యాధుల్లో పోస్ట్ డాక్టొరల్ ఫెలోషిప్
* తగిన చికిత్సలతో కాలేయం సురక్షితం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : వైద్య విద్య అంటే చాలా సుదీర్ఘకాలం పాటు సాగుతుంది. ఎంబీబీఎస్, హౌస్ సర్జన్సీ, ఎండీ, స్పెషలైజేషన్.. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. తొలుత ఎంబీబీఎస్ సీటు సాధించడం దగ్గర నుంచి ఒక్కోటీ పూర్తిచేసుకుంటూ వెళ్లేసరికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ, హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ దెందుకూరి కావ్య మాత్రం 31 సంవత్సరాల 9 నెలల వయసులోనే ఎంబీబీఎస్, ఎండీ, డీఎంలతో పాటు కాలేయ వ్యాధులు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలలో పోస్ట్ డాక్టొరల్ ఫెలోషిప్ కూడా పూర్తిచేశారు. బహుశా భారతదేశంలోనే కాలేయ విభాగంలో ఇంత తక్కువ వయసులో ఇవన్నీ పూర్తి చేసిన తొలి మహిళ ఈమే. ఇందుకు గాను ఆమె ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎచీవర్‌గా గుర్తింపు పొందారు. కేవలం 5 రోజుల వయసున్న చిన్నారికి కాలేయమార్పిడి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించిన ప్రొఫెసర్ మహ్మద్ రెలా వద్ద ఆమె పోస్ట్ డాక్టొరల్ చేయడం విశేషం. డాక్టర్ కావ్య ప్రస్తుతం నగరంలోని కామినేని ఆస్పత్రిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. చిన్న వయసు నుంచే డాక్టర్ కావాలన్న ఆకాంక్ష ఉండేదని, జీవితంలో కొందరు పెద్దలు ప్రతి అడుగులోనూ తనకు అండగా ఉన్నారని ఆమె చెప్పారు.
చికిత్సతోనే చాలా కాలేయవ్యాధులు నయం
“కాలేయవ్యాధుల ఉన్నవారిలో దాదాపు సగం మందికి దానికి చికిత్స ఉందన్న విషయం తెలియదు. ముందుగా లివర్ సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్ లాంటివి ఉంటే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలి. కామినేని ఆస్పత్రిలో కాలేయమార్పిడి 95% విజయాల రేటుతో రోజూ జరుగుతోంది. మార్పిడి చేయించుకున్నవారు మారథాన్ రన్నర్లుగా కూడా ఉంటున్నారు. దాన్ని బట్టి ఆ మార్పిడి తర్వాత కూడా ఎంత సాధారణ జీవనం గడపొచ్చో అర్థమవుతుంది. ఇటీవలి కాలంలో ఫ్యాటీలివర్ కేసులు చాలా వస్తున్నాయి. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం, గుమ్మం ముందుకే అన్నీ రావడం లాంటి వాటి వల్లే ఇది వస్తుంది. అందులో చాలా దశలుంటాయి. దానికి చికిత్స చేయకపోతే లివర్ ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. దాన్నీ పట్టించుకోకపోతే లివర్ సిరోసిస్ వస్తుంది. గ్రేడ్ 4 ఫ్యాటీ లివర్ లేదా ఫైబ్రోసిస్ స్థాయిలో ఉన్నా కూడా చికిత్స చేసేందుకు అవకాశం ఉంది. మన శరీరంలో కాలేయం మాత్రమే తనంతట తానుగా మళ్లీ పెరగగలదు. ప్రస్తుతం హెపటైటిస్ బి, సి లాంటి ప్రమాదకరమైన వైరస్‌లు కూడా ఉంటున్నాయి. వీటివల్ల లివర్ ఫెయిల్యూర్ నుంచి కాలేయ క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. ఈ రెండింటినీ నివారించడానికి తగిన టీకాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే టీకాలు తీసుకుని తమ, తమవారి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలి” అని డాక్టర్ కావ్య దెందుకూరి సూచించారు. ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో ప్రతిరోజూ తాను అందుబాటులో ఉంటానని, కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఎవరైనా తనను సంప్రదించవచ్చని ఆమె చెప్పారు. “నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి మా కుటుంబం నుంచి అపారమైన మద్దతు ఉంది. ముఖ్యంగా. నాన్న డి. సరసురామ్, అమ్మ శ్రీలత, అన్న డి. శ్రీహర్ష, భర్త సుసర్ల కామేష్, కుమార్తె సుసర్ల అనిక, అమ్మమ్మ మహాకాళి సుశీలల మద్దతు, ఆశీస్సులే నన్ను ఇంతవరకు తీసుకొచ్చాయి” అని డాక్టర్ కావ్య వివరించారు.