లక్ష పెట్టుబడి.. రోజుకు 5వేలు లాభం.. ట్రేడింగ్ యాప్స్ మోసం
1 min readపల్లెవెలుగు వెబ్: సైబర్ నేరగాళ్లు నిరంతరం కొత్త ఎత్తులతో జనాల డబ్బుల్ని దోచుకుంటున్నారు. డబ్బు ఆశ చూపి లక్షలకు, లక్షలు మాయం చేస్తున్నారు. మా ట్రేడింగ్ యాప్ లో పెట్టుబడి పెడితే.. మీ పెట్టుబడి నెలలో ..రెండు నెలల్లో రెట్టింపు అవుతుందంటూ ఆశ చూపుతున్నారు. కోలకత్త, ఢిల్లీ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు అక్రమ దందా నిర్వహిస్తున్నారు.
లక్ష పెట్టుబడి.. నెలకు 5 వేల లాభం:
ట్రేడింగ్ యాప్ లో లక్ష పెట్టుబడి పెడితే.. రోజుకు 5 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు అంటూ నమ్మిస్తున్నారు. అలా మీ పెట్టుబడిని ఒక నెలలో రెట్టింపు చేసుకోవచ్చని చెబుతున్నారు. ట్రేడింగ్ గురించి, ట్రేడింగ్ యాప్స్ గురించి అవగాహన లేని యువత డబ్బు కోసం వీరి వలలో పడుతోంది. లక్షల రూపాయలు ఈ ట్రేడింగ్ యాప్స్ లో పెట్టుబడి పెడుతున్నారు. ఓ పది, పదిహేను రోజులు ట్రేడింగ్ అకౌంట్లో లాభం చూపిస్తున్నారు. మరికొంత డబ్బు జమ చేస్తే మొత్తం లాభం, పెట్టుబడి ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చని చెబుతారు. ఇది నమ్మి లక్షలకు లక్షలు ట్రేడింగ్ అకౌంట్ లో వేస్తున్నారు. ఆ తర్వాత ఆ ట్రేడింగ్ అకౌంట్ కార్యకలాపాలు నిలిచిపోతాయి. ట్రేడింగ్ యాప్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే.. నంబర్లు పనిచేయవు. ఏ విధమైన సమాధానం ఉండదు. నష్టపోయామని తెలుసుకున్న యువత పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
మనీ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవద్దు :
మనీ యాప్స్ చాలా ప్రమాదకరమని పోలీసులు చెబుతున్నారు. వీటిని డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి యాప్స్ 350 వరకు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచకుండా.. వాట్సాప్ లకు యాప్ లింక్ పంపి.. డౌన్ లోడ్ చేసుకోమని సైబర్ నేరస్థులు చెబుతున్నారని పోలీసులు అన్నారు. దీని వల్ల వారిని పట్టుకోలేకపోతున్నామని, ట్రేడింగ్ యాప్స్ బ్యాంక్ అకౌంట్ల ద్వార వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.