ఆర్థిక కష్టాలున్నా హామీలు అమలుచేసే దిశలో ముందుకు వెళ్తున్నాం.. రాష్ట్ర మంత్రి
1 min read
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టి.జి భరత్
కర్నూలు , న్యూస్ నేడు: రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలకు మంచి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని బంగారుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. పింఛన్ల పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆయన లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు లేవని.. సమయానికి పింఛన్ అందజేస్తున్నారని మహిళలు మంత్రితో చెప్పారు.అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప జరిగిందేమీ లేదన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. సూపర్ 6 హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులు ఏపీవైపు చూసే పరిస్థితిని కల్పిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ వల్ల ఏపీకి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కష్టపడుతున్నట్లు తెలిపారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధిలో ముందుంచుతామన్నారు. పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజలందరూ ఓపికతో ఉండాలని కోరుతున్నట్లు మంత్రి టి.జి భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యస్. రవీంద్ర బాబు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
