కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నంద్యాల కె.సి.కెనాల్ కార్యాలయం దగ్గర రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, ఆద్వర్యంలో కె.సి.కెనాల్ ఆయకట్టు రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు.కేసీ కెనాల్ ఆయకట్టులో సుమారు 70000 వేల ఎకరాలు రబీ పంట కొనసాగుతోంది.. ఈ పంటలకు ఏప్రిల్ 30వ తేదీ వరకు నీరు అందించాల్సిన అవసరం ఉంది… కానీ అర్ధాంతరంగా కేసి కాలువలో నీటి విడుదలను ప్రభుత్వం నిలుపుదల చేయడం వలన పంటలు ఎండిపోవడం, రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సంవత్సరంలో సుమారుగా 120 రోజులు కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహించి 1562 టిఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా చేరినప్పటికీ అర్ధాంతరంగా నీటి విడుదలను ఎందుకు ఆపారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.గత సంవత్సరం బోటాబొటిగా వర్షాలు కురిసినా, శ్రీశైలంలో రిజర్వాయర్ కు చాలా తక్కువ నీరు చేరినప్పటికీ రబీ పంటలు పూర్తి అయ్యేంతవరకు నీటిని అందించిన విషయాన్ని రైతులు గుర్తు చేసారు.ధర్నా అనంతరం రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి కె.సి.కెనాల్ ఎగ్జిక్యుటీవ్ అధికారి గారికి ఫోన్ ద్వారా మాట్లాడుతూరబీ పంటలను దృష్టిలో ఉంచుకొని, నీరు విడుదల చేయకపోతే తీవ్రంగా నష్టపోయే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని, తక్షణమే కేసీ కెనాల్ లో నీటి విడుదలను పునరుద్ధరించి ఏప్రిల్ 30 తేది వరకు కొనసాగేలాగా కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేసారు.దీనిపై ఎగ్జిక్యూటివ్ అధికారి స్పందిస్తూ..తాను పై అధికారుల దృష్టికి తీసుకొనివెల్తానని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారని అన్నారు. అనంతరం కె.సి.కెనాల్ సూపరింటెండెంట్ కు రైతులు వినతిపత్రం అందచేసారు.ఈ కార్యక్రమంలో బెక్కం చిన్న రామకృష్ణారెడ్డి, D.V.సుబ్బారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మరియు కె.సి.కెనాల్ ఆయకట్టు పరిధిలో వివిధ మండలాల రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.