నిర్లక్ష్యం అలముకున్న వ్యవస్థల్లో సమూలమార్పులకు ప్రత్యేక చర్యలు …
1 min read
ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
పలు డివిజన్ లలో పనిచేస్తున్న వాలంటరీ, పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై ఆరా
పనితీరు మెరుగుపరుచుకోవాలి లేకుంటే చర్యలు తప్పవు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : నిర్లక్ష్యం అలముకున్న వ్యవస్థల్లో సమూలమార్పులు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు. అవసరమైతే ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. ఏలూరు నియోజకవర్గంలో పారిశుద్ద్య పరిస్థితులను మరింత మెరుగుపర్చేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగానే ఇప్పటికే 1,2 సర్కిళ్ళ పరిధిలోని వివిధ సచివాలయాల సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో సమావేశమైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వారికి పలు సూచనలు చేశారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు. లేకుంటే వేటు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తాజాగా మంగళవారం కూడా 3,4 సర్కిళ్ళ పరిధిలోని డివిజన్లలో పనిచేస్తోన్న పారిశుద్ద్య సిబ్బంది పనితీరుపై సంబంధిత సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలతో సమావేశమైన ఎమ్మెల్యే చంటి వారిని వివరాలడిగి తెలుసుకున్నారు. పారిశుద్ద్య సిబ్బంది అంతా విధులకు సక్రమంగా హాజరవుతున్నారా? లేదా? అంటూ ప్రశ్నించారు. అలాగే మెరుగైన పారిశుద్ద్య పరిస్థితులు నెలకొనేందుకు సిబ్బంది సరిపోతున్నారా? అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పారిశుద్ద్యాన్ని మెరుగుపర్చే పని నిరంతర ప్రక్రియ అని, ఈ విషయంలో ఎక్కడ అలసత్వం నెలకొన్నా దీనిద్వారా చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. అందుకే వర్షాకాలం కంటే ముందుగానే ఒకపక్క అధికారులను అప్రమత్తం చేయడంతో పాటూ, ఇంకోపక్క క్షేత్రస్థాయిలో తానే స్వయంగా పర్యటిస్తున్నట్లు స్పష్టంచేశారు. విధులకు సక్రమంగా హాజరుకాని పర్మినెంట్ సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎవ్వరిపైనైనా వేటు తప్పదని హెచ్చరించారు. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తేనే సమూలమార్పులు సాధ్యమవుతాయని అభిప్రయపడిన ఎమ్మెల్యే చంటి,,, ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదేక్రమంలో తానిచ్చిన నినాదాన్ని అందిపుచ్చుకుని డివిజన్లను అత్యంత పరిశుభ్రంగా ఉంచిన పారిశుద్ద్య సిబ్బందికి ఒక్కొక్కరికీ 10వేల రూపాయలను సొంత నగదును ఇస్తానని ప్రటించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, కార్పొరేషన్ కమిషనర్ ఎ. భానుప్రతాప్, అదనపు కమిషనర్ జి. చంద్రయ్య, కో – ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్ పెదబాబు, కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్, టిడిపి నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, మారం అను, బొద్దాని శ్రీనివాస్, చోడే బాలు, తవ్వ అరుణకుమారి, నాగిరెడ్డి కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.