పిఎంఎజివై ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించండి
1 min read
ప్రజా అవసరాల మేరకు కృషి చేయండి… జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామీణ యోజన క్రింద ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు 19 గ్రామాలు ఎంపిక చేశామని అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గ్రామ సర్పంచులు, ఎంపిడిఓలను సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామీణ యోజన పథకంపై గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సిఈఓ సుబ్బారెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, జిల్లా అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామీణ యోజన క్రింద ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికల రూపొందించాలని సంబంధిత అధికారులు, సర్పంచ్ లను ఆదేశించారు. ఈ కార్యక్రమం క్రింద ఎంపిక చేసిన 19 గ్రామాల్లో అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గతంలో సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన క్రింద గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సంబంధిత పార్లమెంటు సభ్యులు వారి పదవి కాలంలో ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని అభివృద్ధి చేసేవారన్నారు. ఇందుకు అనుబంధంగా ఈ పథకాన్ని ఇంకా ప్రధానంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి వారిని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. చాగలమర్రి మండలంలోని మద్దూరు, పెద్దబోదనం, పాణ్యం మండలంలోని చెందిన గోనవరం, కొండజూటూరు, జూపాడుబంగ్లా మండలంలోని పి.గణపురం, నంద్యాల మండలంలోని రాయమల్పురం, రుద్రవరం మండలంలోని పెద్దకంబులూరు, వెలుగోడు మండలంలోని అదుల్లపురం, గోస్పాడు మండలంలోని సంబవరం, పసురపాడు, బేతంచెర్ల మండలంలోని గొల్లగుట్ట, కోవెలకుంట్ల మండలంలోని సౌదరిదిన్నె, మహానంది మండలంలోని తమ్మడపల్లి, మసీదుపురం, పాములపాడు మండలంలోని వేంపెంట, మిడ్తూరు మండలంలోని అలగనూరు, చెరుకుచెర్ల, ఆత్మకూరు మండలంలోని వడ్లరామపురం, ఆళ్లగడ్డ మండలంలోని పాతకందూర్ గ్రామాలను ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామీణ యోజన క్రింద ఎంపిక చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామాల్లో టాయిలెట్స్ లేక ఇబ్బంది పడే వారి కోసం కమ్యూనిటీ టాయిలెట్స్ ఏర్పాటు చేయవచ్చన్నారు. గ్రామ ఖర్చును తగ్గించు గ్రామ ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సిసి రోడ్లు ఉపాధి హామీ పనుల ద్వారా ఇంకా ఐదు వందల కోట్లకు అనుమతులు ఇవ్వడానికి కలెక్టర్ కు అవకాశం ఉంటుందని అందుకు సిసి రోడ్లు, బిటి రోడ్లు కాకుండా గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ గ్రామ సర్పంచులు, ఎంపిడిఓలను ఆదేశించారు. గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు చర్యలు తీసుకోవాలన్నారు. రూఫ్ ఉన్న ప్రతి ఇంటి పైన సోలార్ ఫలకల ఏర్పాటు చేయాలన్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కిలో వాట్ కు 30 వేలు, రెండు కిలో వాట్ లకు 60 వేలు, మూడు కిలో వాట్ యూనిట్లకు 78 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి కూడా బిసిలకు 20వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చే సదుపాయం ఉందన్నారు. మిగిలిన మొత్తానికి బ్యాంకులు రుణం కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక కిలో వాట్ సోలార్ ఫలకల ఏర్పాటు ద్వారా రోజుకు 4 యూనిట్ల, 2 కిలో వాట్ల సోలార్ ఫలకల ద్వారా రోజుకు 8 యూనిట్లు, 3 కిలో వాట్ల సోలార్ ఫలకల ద్వారా రోజుకు 12 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అందుకు గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీ, పంచాయతీ సెక్రటరీ ఇళ్లపై ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా గ్రామాల్లో పాడి పశువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బయో గ్యాస్ ప్లాంటు ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గ్రామ సర్పంచులకు వివరించారు.