ఉత్సాహంగా..చదవండి..
1 min readసునాయస పద్దతుల్లో బోధించండి
- కర్నూలు సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు, మానస హాస్పిటల్ అధినేత డా. రమేష్ బాబు
కర్నూలు, పల్లెవెలుగు: విద్యార్థులకు ఒత్తిడి లేకుండా.. సునాయస పద్దతుల్లో చదువు నేర్పాలని కర్నూలు సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు, మానస హాస్పిటల్ అధినేత డా. రమేష్ బాబు ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం కర్నూలులోని కేంద్రీయ విద్యాలయంలో 8,9,10వ తరగతి విద్యార్థులకు ‘ ఉత్సాహంగా చదవండి..’ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ పాయల్ ప్రియదర్శిని నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి మానస హాస్పిటల్ అధినేత డా. రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వేసవి సెలవుల తరువాత పాఠశాలలకు ఉత్సాహంగా వస్తున్నారని, అదే ఉత్సాహంతో సంవత్సరం పాటు చదువుకునేలా విద్యార్థులకు సులభమైన పద్దతుల్లో విద్యను బోధించాలని ఉపాధ్యాయులను కోరారు. పాఠశాలకు వచ్చిన మొదటి రోజు నుంచే ప్రణాళికతో లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్నారు. జ్ఞానానికి మార్కులు మాత్రమే కొలమానం కాదని… తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం, సత్ప్రవర్తన, క్రమశిక్షణతో నడుచుకోవాలని, అప్పుడే బంగారు భవిష్యత్‌కు బాటలు పడతాయన్నారు. విద్యార్థులు సరైన సమయానికి పౌష్టికాహారం తీసుకోవాలని, శారీరక వ్యాయామం తప్పనిసరి అని సూచించారు. ఆడుతూ.. పాడుతూ చదువుకోవాలని సూచించిన కర్నూలు సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు, మానస హాస్పిటల్ అధినేత డా. రమేష్ బాబు… చిన్న వయస్సులో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.