కార్మికులకు నష్టదాయకమైన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
1 min read
కార్మిక చట్టాలను పరిరక్షించాలి ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి – సిఐటియూ డిమాండు
కర్నూలు,న్యూస్ నేడు: పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కార్మికులను నయా బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను పరిరక్షించాలని ప్రభుత్వ సంస్థల ప్రైవేటీ కరణ ఆపాలని సిఐటియు పట్టణ కార్యదర్శి టి.శివరాం,మండల కార్యదర్శి ఎ.వి.భాస్కర్ రెడ్డి,రైతు సంఘం మండల అధ్యక్షులు బి.నాగమద్దయ్య సిఐటియు ప్యాపిలి మండల కార్యదర్శి ఎస్.ఎ.చిన్న రెహమాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బేతంచెర్ల సర్కిల్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు బ్రిటిష్ కాలం నుండి పోరాటాల ద్వారా ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు సివిల్ కోడ్ లుగా మార్చుతూ నరేంద్ర మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం దుర్మార్గం అన్నారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైన విద్యుత్తు ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ బ్యాంకులు రైల్వేలు విశాఖ ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణకు పూనుకొని అందులో పని చేసే ఉద్యోగులను కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నదన్నారు.అయితే విశాఖ స్టీలు ప్రైవేటు పరం కాకుండా పది సంవత్సరాలుగా కార్మికులు పోరాటాల ద్వారా కాపాడుకుంటున్నారన్నారు. డిమాండ్స్ సాధన కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు ఈ రోజు జరప తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జూలై 9 కి వాయిదా వేయడం జరిగిందని కార్మికులు ఉద్యోగులంతా జూలై 9న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆదినారాయణ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,చంద్ర,లక్ష్మన్న,మద్దయ్య,అన్వేష్, నాగేశ్వరరావు, బాలు,బాబు,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.