విమానయాన సంస్థలు.. నష్టాలతో ఎదురీత !
1 min readపల్లెవెలుగు వెబ్ : విమానంలో ప్రయాణించడం చాలా మంది మధ్యతరగతి, పేదవారికి ఓ కల. కొందరికి తీరని కోరిక కూడ. బడాబాబుల కోసమే విమానయానం ఉందన్న అపోహ ప్రజల్లో ఉంటుంది. డబ్బున్న వారైతేనే టికెట్లు కొనగలరని అనుకుంటారు. మరి, డబ్బున్న వారు నిత్యం ప్రయాణించే విమానాలు నడిపే సంస్థలు కూడ బాగా డబ్బు సంపాదించి ఉండాలి కదా. మరి కోట్ల కొద్దీ నష్టాల్లో విమానాలు నడిపే సంస్థలు ఎందుకు కూరుకుపోతున్నాయి ?. విమానయాన సంస్థలు ఎందుకు దివాళ తీస్తున్నాయి ?.
విమానయాన సంస్థలు మూడు రకాలుగా ఆదాయాన్ని పొందుతాయి. వీటిలో ప్రయాణీకులు టికెట్ రెవెన్యూ ఒకటి కాగా.. రెండోది కార్గో సేవలు, మూడోది విమానాల్లో, విమానాశ్రయాల్లో అందించే ఫుడ్ అండ్ బెవరేజస్. ఈ మూడింటి ద్వార విమానయాన సంస్థలు ఆదాయాన్ని పొందుతాయి.
– ప్యాసింజర్ రెవన్యూ అన్నది ఒక్క రోజులో ఎన్ని విమానాలు ప్రయాణించాయి. ఎన్ని సీట్లు విమానంలో ఉన్నాయి. వాటిలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి అన్న దాని పై ఆధారపడి ఉంటుంది.
– కార్గో సేవలు నుంచి వచ్చే ఆదాయం కూడ ఇంచుమించు ప్యాసెంజర్ రెవెన్యూ ద్వార వచ్చే ఆదాయం లాగ ఉంటుంది. ఒక్క రోజులో ఎన్ని విమానాలు వెళ్లాయి. ఎంత సరుకుతో వెళ్లాయి. ఒక్కో టన్ను సరకుకు ఎంత చెల్లించారు అన్న దానిపై కార్గో నుంచి వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది.
– మూడోది ఫుడ్ అండ్ బెవరేజెస్ నుంచి వచ్చే ఆదాయం. ఇది విమానంలో ఎంత మంది ప్రయాణీకులు ప్రయాణించారు అన్న దాని పై కొద్దిగా ఆధారపడి ఉంటుంది. ప్రయాణీకులు ఎంత డబ్బు ఖర్చు చేశారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఈ మూడు ప్రధాన మార్గాల ద్వార ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీకి ఆదాయం వస్తుంది.
విమానయాన సంస్థల ఖర్చు :
విమానయాన సంస్థలు నష్టాల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణం ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉండటం. వాటిలో అధికంగా ఖర్చు చేసేది విమాన ఇంధనం గురించే. ఈ విమాన ఇంధనం అనేది మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మూడు అంశాల ఆధారంగా ఎప్పటికప్పుడు ధరల్లో మార్పు ఉంటుంది. రోజుకు ఎన్ని ప్రయాణాలు సాగాయి, ఎంత ఇంధనం ఖర్చు చేశారు, మార్కెట్లో ఉన్న ఇంధనం ధర ఎంత అన్న అంశం పై ఇంధన ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి విమానంలో ఉన్న సగం సీట్లు కూడ భర్తీ కావు. విమానం ఒక్కసారి టెర్మినల్ నుంచి కదలితే ఒక్క సీటు భర్తీ అయినా.. మొత్తం సీట్లు భర్తీ అయినా ఇంధనం మాత్రం ఒకేరకంగా ఖర్చు అవుతుంది. అప్పుడు విమానంలో ఉన్న మొత్తం సీట్లలో ఒక్క సీటు ఖాళీగా ఉన్నా.. వాటి నుంచి వచ్చే ఆదాయం తగ్గుతుంది.
– విమానయాన సంస్థలు ప్రస్తుతం సొంత విమానాలు నడపడం లేదు. వేరే వారి నుంచి లీజుకు తీసుకుంటున్నాయి. విమానాలు లీజుకు తీసుకోవడం ద్వార నెలనెల వాటికి చెల్లించాల్సిన ఖర్చు పెరుగుతోంది. ఫలితంగా ఆదాయం కంటే ఖర్చు పెరుగుతోంది. ఎన్ని విమానాలు లీజుకు తీసుకుంటే అంత ఖర్చు పెరుగుతోంది. వీటితో పాటు విమానయాన సంస్థల్లోని ఉద్యోగుల జీతాలు కూడ అధికంగా ఉంటాయి. విమానసంస్థలు తీసుకున్న రుణం తాలుకు ఖర్చులు, విమానాలు నడపడం ద్వార వెళ్లే తరుగు, వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు అధికంగా ఉంటోంది. ఇవన్నీ కలగలిపి విమానయాన సంస్థల నష్టానికి దారి తీస్తున్నాయి.
విమానయాన సంస్థలకు ఉన్న సవాళ్లు :
విమానయాన సంస్థలకు ఉన్న ప్రధానమైన సవాళ్లలో ఇంధనం ఖర్చు ప్రధానమైంది. ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీ ఇంధనం ధరలు పై నియంత్రణలేదు. దీనితో పాటు ఎప్పుడు ఏ ధర ఉంటే అదే ధరలో ఇంధనం కొనాల్సి ఉంటుంది. అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గులపై విమాన ఇంధన ధరలు ఆధారపడి ఉంటుంది.
– విమానం కదిలిన ప్రతిసారి డిజిసీఏ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. సెక్యురిటీ నిబంధనల అమలులో ఏమాత్రం అలసత్వం వహించిన చర్యలు తప్పవు. ఈ నేపథ్యంలో సెక్యురిటీ, డీజీసీఏ నిబంధనలు పాటించడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇది కూడ ఒక ప్రధానమైన సవాలు.
– ఇంధనం, ఉద్యోగుల జీతాలతో పాటు విమానయాన సంస్థలకు ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. విమానాల అద్దె , పార్కింగ్ ఫీజులు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి. విమానం ఒక్క ప్రయాణీకుడితో కదిలినా.. వంద మంది ప్రయాణీకులతో కదిలినా లీజు ధర, పార్కింగ్ ఫీజు ఒకేలా ఉంటుంది. ఇది కూడ విమానయాన సంస్థలను నష్టాల్లోకి నెట్టడానికి ఒక కారణం.
– వ్యాపారం అన్నాక పోటీ తప్పదు. పోటీలేని వ్యాపారం ఉండదు. ఈ నేపథ్యంలో ముందే నష్టాల్లో ఉన్న కంపెనీలు ఎలా లాభాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉంటాయి. ఈ క్రమంలో మిగిలిన పోటీదారులతో పోటీపడాలనే ఉద్దేశంతో విమాన టికెట్ ధరలు కూడ తగ్గిస్తాయి. ప్రయాణీకులు కూడ ఎవరి వద్ద తక్కువ ధర ఉంటే వారి విమానంలోనే ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు తగ్గించక తప్పని పరిస్థితి.
– విమానయనా సంస్థలకు మూడు మార్గాల ద్వార ఆదాయం ఉంటే.. ఏడు మార్గాల ద్వార నష్టాలు ఉన్నాయి. ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉన్నప్పుడు నష్టం వస్తుంది. ఇదే భారత విమానయాన సంస్థల విషయంలో జరుగుతోంది. ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీస్ పరిస్థితి ఆదాయం మూడు, ఖర్చు ఏడు అన్నట్టు తయారైంది.
మూలిగే నక్క పై తాటిపండు :
ఇన్ని విధాలుగా భారత విమానయానసంస్థలు నష్టాల్లో ఎదురీదుతుంటే.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు పరిస్థితి తయారైంది. కరోన దెబ్బతో విమానయాన సంస్థలు దివాళ తీసే పరిస్థితి ఏర్పడింది. విమానాలు కదలకపోయినప్పటికీ.. వాటి నిర్వహణ, పార్కింగ్ ఫీజు, లీజ్ ధర , ఉద్యోగుల జీతాలు తప్పని సరిగా చెల్లించాల్సిందే. ఫలితంగా ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీస్ మరింత అప్పుల్లో కూరుకుపోయాయి. ప్రతి రంగంలోను కొన్ని సంస్థలు నష్టాల్లో .. కొన్ని సంస్థలు లాభాల్లో ఉంటాయి. కానీ ఒక్క విమానయాన రంగంలో మాత్రం కేవలం ఒక్క సంస్థ మాత్రమే స్వల్ప లాభాలతో నెట్టుకొస్తుందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది.