అన్న క్యాంటిన్లు ప్రారంభించండి.. టి.జి భరత్
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: పేదల ఉసురు ప్రభుత్వానికి తగలకూడదంటే ఇప్పటికైనా రాష్ట్రంలో అన్న క్యాంటిన్లు ప్రారంభించాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. అన్నం పెట్టే అన్న క్యాంటిన్లను వైసీపీ ప్రభుత్వం కొనసాగించకపోవడం బాధాకరమన్నారు. నగరంలోని 43వ వార్డు పరిధిలోని ఇందిరాగాంధీ నగర్లో ఒక్క రోజు అన్న క్యాంటిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టితో కలిసి టి.జి భరత్ పాల్గొని అన్న క్యాంటిన్ ప్రారంభించారు. అనంతరం స్థానికులకు ఉచితంగా అన్నం పెట్టారు. ఈ సందర్బంగా భరత్ మాట్లాడుతూ పేద ప్రజలు అన్న క్యాంటిన్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అతి తక్కువ ధరకే మూడు పూటలా కడుపునిండా అన్నం పెట్టే అన్న క్యాంటిన్లను ప్రభుత్వం పేరు మార్చి అయినా కొనసాగించాలని తాను కోరుతున్నట్లు భరత్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకొని రాష్ట్రంలో అన్న క్యాంటిన్లను మళ్లీ ప్రారంభించాలని కోరారు. అనంతరం సోమిశెట్టి మాట్లాడుతూ కర్నూల్లో పేదల ఆకలిని టిజి భరత్ తీర్చుతున్నాడన్నారు. సేవ చేసే భరత్ ను ఎన్నుకుంటే ప్రజలకు అంతా మంచే జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో టిజి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని సోమిశెట్టి కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి రాజశేఖర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి చంద్ర, తెదేపా నగర అధ్యక్షుడు గున్నామార్క్, హనుమంతరావు చౌదరి, నేతలు అశోక్ చౌదరి, నరేష్, సునీల్, సాంబ, లక్ష్మణ్, ఈశ్వరయ్య, రవి, చిట్టిబాబు, మహిళా నాయకురాళ్లు లలితమ్మ, భారతి, భాగ్యమ్మ, ఇతరవార్డుల ఇంచార్జీలు, నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.