ముఖ్యమంత్రి సారధ్యంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఏపీ
1 min read
త్వరలో చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ప్రారంభం
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైను మంజూరు ద్వారా ప్రజల చిరకాల నెరవేరబోతుంది
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కోటమి ప్రభుత్వం నెరవేర్చుతోంది
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలోని ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెంలో ఆదివారం రాత్రి జరిగిన మినీ మహానాడుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు సొంగా రోషన్ కుమార్, చింతమనేని ప్రభాకర్, టిడిపి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, నియోజకవర్గం పరిధిలోని నాయకులతో కలిసి ఆంధ్రుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యేలు సొంగా రోషన్ కుమార్, చింతమనేని ప్రభాకర్ ఎనలేని కృషి చేస్తున్నారని, వారికి తన వంతు సహకారం అందిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో చేపట్టిన ఎమ్మెస్ఎంఈని చింతలపూడి నియోజకవర్గానికి మంజూరు చేయగా, 70 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈకి ఇటీవల శంకుస్థాపన చేసామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతున్నట్లు ఎంపీ ప్రకటించారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల నిలిచిపోయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రారంభించి, పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఎంపీ పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులకు సంబంధించిన చిక్కుముడి ఉందని, అది పరిష్కారం కాగానే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించడం జరుగుతుందని ఎంపీ తెలిపారు. అలాగే ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని ఎంపీ స్పష్టం చేశారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు ఎంపీ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పుణ్యమా అని తనలాంటి యువతకు కూడా చట్టసభలో అడుగపెట్టే అవకాశం కలిగిందని, పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం పామాయిల్ రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గిట్టుబాటు ధర కల్పించామని, అలాగే పొగాకు రైతులకు పరిమితి నిబంధనలు సదలించడం ద్వారా రూ.106 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చామని ఎంపీ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఎమ్మెల్యేలతో కలిసి తాను చేసిన కృషి వల్ల కొల్లేరు ప్రాంత ప్రజల దీర్ఘకాలిక సమస్యకు కాస్త వెసులుబాటు లభించిందని, త్వరలోనే తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని ఎంపీ భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారని ఎవరైనా అడిగితే ఎప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులను సగర్వంగా ప్రజలకు వివరించాలని ఎంపీ శ్రేణులకు సూచించారు. నిరుద్యోగ యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం గతంలో జాబ్ మేళా నిర్వహించి, 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, కనీసం 6 వేలకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం జూన్ 6న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. ప్రజల ఆశీస్సులతో గెలిచిన తాము వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు.