ఏపీ మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
1 min read
పల్లెవెలుగు , నంద్యాల: గోస్పాడు మండల కేంద్రంలో ని ఏపీ మోడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. పాఠశాల పరిసర ప్రాంతాలు, తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆర్‌ఓ ప్లాంట్‌లో లీకేజీ సమస్యను గుర్తించి మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలోని గ్రంథాలయాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పుస్తకాలు, కుర్చీలు, ర్యాక్లు వంటి లైబ్రరీ సామాగ్రి తప్ప ఎటువంటి వస్తువులు ఉంచకూడదన్నారు. పాఠశాలలో ఇంకా మిగిలిపోయిన స్కూల్ బ్యాగులను పరిశీలిస్తూ పాఠశాలకు ఎన్ని సంచులు ఇండెంట్ చేయబడ్డాయి? ఎన్ని సంచులు పంపిణీ చేయబడ్డాయి? ఎన్ని సంచులు మిగిలి ఉన్నాయి? సంచులు ఎందుకు ఎక్కువగా ఇండెంట్ చేయబడ్డాయి? వీటిపై సవివరమైన నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో రైటింగ్ ప్యాడ్ లేకుండా కుర్చీలను ఉపయోగించే విద్యార్థులతో పరీక్ష నిర్వహించే అంశంపై నివేదిక ఇవ్వాలన్నారు. పాఠశాలలోని ల్యాబ్ గదులన్నింటికీ తాళాలు వేయకుండా వాటిని క్రమం తప్పకుండా వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలోని వైద్యశాలతో పాటు మెట్ల పక్కన గదులను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాల పరిసరాల్లో చెల్లాచెదురుగా వున్న IFP బాక్స్‌లను శుభ్రం చేయడంతో పాటు ఆవరణను చక్కగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
