మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలి
1 min read
ఎమ్మెల్యే బలేటి రాధాకృష్ణయ్య (చంటి)
సమ్మర్ స్టోరేజ్ వద్ద మోటర్ల ద్వారా ట్యాంకును నింపే ప్రక్రియ పరిశీలన
పాల్గొన్న కో-ఆప్షన్ సభ్యులు ఎస్ యంఆర్ పెదబాబు, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్ లు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రజల భవిష్యత్ నీటి అవసరాలను తీర్చేందుకు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఈ వేసవిలో ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా నీటిఎద్దడి తలెత్తకుండా సమర్థవంతమైన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నిరంతరాయంగా, సమర్థవంతంగా శ్రమిస్తున్నారు. ఇదేక్రమంలో ఏపి అసెంబ్లీలోనూ ఆయా సమస్యల వాణిని గట్టిగా వినిపించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్దితో కృషిచేస్తున్నారు. త్రాగునీటి సమస్యను సైతం అసెంబ్లీలో ప్రస్తావించిన ఆయన ఆ సమస్య పరిష్కారానికి కూడా చర్యలు చేపట్టారు. తాజాగా మంగళవారం ఏలూరు మల్కాపురంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి అక్కడ కృష్ణ కెనాల్ నుండి మోటార్ల ద్వారా ట్యాంకును నింపే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రస్తుతం 17 మోటార్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నింపే ప్రయత్నం జరుగుతోందన్నారు. కాలువను మరోవారం రోజులపాటూ అదనంగా వదలాలని సంబంధిత మంత్రిని కోరానన్న ఎమ్మెల్యే చంటి ఆ దిశగా సఫలికృతమవ్వడం సంతోషాన్నిచ్చిందన్నారు. దీంతో యుద్ధప్రాతిపదికన 17 మోటార్ల సాయంతో కాలువ నుండి నీటిని తోడే ప్రయత్నంలో భాగంగా రాత్రింబవళ్ళు చేసిన కృషిఫలితంగా ట్యాంకులో ప్రస్తుత నీటిమట్టం 11 మీటర్లకు చేరుకుందన్నారు. ఆ స్థాయి 14 మీటర్లకు చేరుకుంటే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పుతాయని, ప్రజలు కూడా నీటిని వృథాచేయకుండా బాధ్యతాయుతంగా మెలగాలని ఎమ్మెల్యే చంటి సూచించారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్‌ఈ నాగార్జునరావు, కార్పొరేషన్ కమిషనర్ ఎ. భానుప్రతాప్, ఎంఈ సురేంద్రబాబు, ఏఈలు సాంబశివరావు, సుబ్రహ్మణ్యం, కో – ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, కార్పొరేటర్ సబన శ్రీనివాస్, టిడిపి నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
