ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
1 min read
హొళగుంద , న్యూస్ నేడు : తుంగభద్ర దిగువ కాలువ కింద రబి సీజన్ లో వరి పంటను సాగు చేస్తున్న ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తుంగభద్ర దిగువ కాలువకు ఈ నెల 24వ తేదీ వరకు నీటిని విడుదల చేయనున్నట్లు తుంగభద్ర బోర్డ్ అధికారులు తెలియజేశారని తుంగభద్ర ప్రాజెక్ట్ దిగువ కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు తెలిపారు. హెుళగుంద మండలంలో తుంగభద్ర దిగువ కాలువ కింద వరి పంటను సాగు చేస్తున్న రైతులు దిగువ కాలువకు ఈనెల 10వ తేదీన అధికారులు ఆపివేస్తారని ఆందోళన చెందుతున్నట్లుగా తెలిసిందని ఇదే విషయాన్ని తుంగభద్ర బోర్డు అధికారుల దృష్టికి తీసుకొని పోయి ప్రస్తుతం వరి పంట పూర్తిగా కంకి దశలో ఉందని కాలువకు నీటిని ఆపివేస్తే దిగుబడి తగ్గి పంట తాలుపడి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని కాబట్టి పంటలు చేతికి వచ్చేవరకు నీటిని విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. దీనికి సమాధానంగా బోర్డు అధికారులు ఈనెల 24వ తేదీ వరకు దిగువ కాలువకు నీటిని విడుదల చేస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపినట్లు టిడిపి ఎల్ఎల్సీ డిసి చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు తెలిపారు.