PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాలకులతోనే వెనుకబాటుతనం

1 min read

– చైతన్యమైతేనే సీమ అభివృద్ధి
– ఐజేయూ జాతీయ అధ్యక్షలు కె. శ్రీనివాస రెడ్డి,
– జర్నలిస్టుల సంక్షేమమే ఏపీయూ డబ్ల్యూజే లక్ష్యం
– ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుఐవీ సుబ్బారావు
– ఎగువ భద్రతతో ముప్పు : రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి నేటి ప్రత్యేక నవ్యాంధ్రప్రదేశ్ వరకు అన్ని విధాలుగా నష్ట పోవడం, వెనుకబాటు తనానికి గురైంది రాయలసీమ వాసులేనని ఐజేయూ జాతీయ అధ్యక్షలు కె. శ్రీనివాస రెడ్డిఅన్నారు. అందుకు ప్రజలు, పాలకులు, జర్నలిస్టులు నడుం భిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా కేంద్రంలోని దేవీ ఫంక్షన్ హాలులో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కె.నాగరాజు అధ్యక్షతన “రాయలసీమ అభివృద్ధి-మీడియా పాత్ర ” అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో పాల్గొని మాట్లాడారు. నాటి నుంచి నేటి వరకు అధికశాతం రాయలసీమకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా వ్యవహరించారని, అయినా కరువుసీమ అభివృద్ధి గురించి ఆలోచించిన దాఖలాల్లేవన్నారు. అందుకే నేటికీ ఈ ప్రాంతంలో వలసలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. వెనుకబాటుతనానికి ప్రధాన మూలం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడం, సరైన విద్య లేకపోవడం, నీటి వనరులు లేకపోవడం, ఉన్నా వినియోగించుకోకపోవడమే ప్రధాన కారణమన్నారు. రాజకీయ నాయకులు సామాజిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, కేవలం స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అదే రీతితో ప్రజలు కూడా ఉన్నారన్నారు. వీరందరిని చైతన్యం చేసేందుకు ఆలోచించే కథనాలు రాయాలన్నారు. అలాగే రాష్ర్టంలో గానీ, దేశంలో గానీ సంపద వీకేంద్రీకరణ జరగడంలేదన్నారు. కేవలం కేంద్రీకృతమౌతుందన్నారు. దీనివల్ల పేదలు పేదలుగానే మిగులుతున్నారన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదానీకి రోజుకు వెయ్యి కోట్లు ఆదాయం రావడమేంటని ప్రశ్నించారు. అంటే సంపదంతా సంపన్నుల చేతుల్లోకెళుతోందన్నారు. కృష్ణా బేసిన్ కు సంబంధించిన నీటి వాటాల విషయంలో ఇరు రాష్ర్టాల సీఎంలు సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. అలా చేయకపోవడంతో కేంద్రం కలుగజేసుకుని గోదావరిపై 71, కృష్ణానదిపై 31 చొప్పున నిర్మించిన ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తీసుకుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం ఉమ్మడి ఏపీ 1952లో ఆంధ్రరాష్ర్టం, 1956లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, 2014లో నవ్యాంధ్రప్రదేశ్ గా ఏర్పడినా రాయలసీమకు కన్నీళ్లు తప్పడంలేదన్నారు. చెంతనే నీరున్నా వాటిని ఒడిసి పట్టుకుని నిల్వ చేసుకునే సామర్థ్యం గల రిజర్వాయర్లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నడుం భిగిస్తేనే హక్కుల సాధన సాధ్యమౌతుందన్నారు.సామాజిక విశ్లేషకులు లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఎగువ భద్రతతో సీమకు ఉరితాడు తప్పదన్నారు. జర్నలిస్టులు రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు. సీమలో కరువును నివారించాలంటే కృష్ణా జలాలతోనే సాధ్యమన్నారు. విభజనతో అత్యంత దారుణంగా నష్టపోయిన ప్రాంతం రాయలసీమ అన్నారు. ఈ ప్రాంతంలో వలసలు తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ జాడలు ఎక్కడా కన్పించడంలేదన్నారు. 1990, 1996 మధ్య కాలంలో జర్నలిస్టులంటే జిల్లా, రాష్ర్ట స్థాయి నేతలు భయపడేవారన్నారు. అందుకు జర్నలిస్టులకు మేథో సంపత్తి ఎక్కువుండేదన్నారు. అందువల్ల ప్రతి జర్నలిస్టు మన ప్రాంతాలపై పూర్తిగా అధ్యయనం చేస్తేనే లోటు పాట్లు తెలుస్తాయన్నారు. తద్వారా ఎలాంటి ఉద్యమాలు చేయాలో ఒక కమిటీ ద్వారా ముందుకెళితే అనుకున్నది సాధించి తీరవచ్చని తెలియజేశారు. అంతకుముందు సీనియర్ జర్నలిస్టు మృతిపట్ల మౌనం పాటించారు. అలాగే ఆదోనికి చెందిన ఓ జర్నలిస్టు కుమారుడు జర్నలిస్టుల గురించి సమాజ గతిని మార్చే ఓ అక్షర యోధులారా అంటూ పాడిన పాటతో సెమినార్ ను ప్రారంభించారు. సెమినార్ ప్రారంభానికి ముందు జానపద కళాకారులు గోపాల్ బృందం సభ్యులు రాయలసీమలో నెలకొన్న కరువు కాటకాలపై ఆలోచింపజేసేలా పాటలు పాడి అలరించారు. అనంతరం ఐజేయూ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యే ఎం.ఏ గఫూర్, సీపీఐ రాష్ర్ట నాయకులు రామచంద్రయ్య, నగర మేయర్ బీవై.రామయ్య, బీజేపీ నాయకులు కపిలేశ్వరయ్య, ఏపీయూడబ్ల్యూజే రాష్ర్ట అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ నాయకులు అంబటి ఆంజనేయులు, ప్రసాద్, సోమసుందరం,నల్లధర్మారావు, ఏపీ యూ డ బ్లుజే రాష్ట్ర కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, శివ, ఇతర రాష్ర్ట నాయకులను జిల్లా నాయకులు నాగరాజు, కొండప్ప, శ్రీనివాస గౌడ్, రామాంజనేయులు, శివరాజ్ కుమార్, సుంకన్న తదితరులు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి మెమొంటోలు అందజేశారు.

About Author