PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా చైతన్య యాత్రలో బడేటి రాధాకృష్ణయ్య

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు: రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి జగన్ తన మంత్రులతో నాటకాలు ఆడిస్తున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టి.డి.పి ఇంఛార్జి బడేటి చంటి ఆరోపించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర ఆదివారం స్థానిక 20వ డివిజన్ పోస్టల్ కాలనీ 11వ రోడ్డు దగ్గర నుండి ప్రారంభమైంది.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించటంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడేటి చంటి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు పదవులకు రాజీనామా పేరుతో చేస్తున్న డ్రామాలను చూసి అన్నివర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా 5 కోట్ల ఆంధ్రుల కోసం మహా పాదయాత్ర చేస్తున్న దేశానికి అన్నం పెట్టే రైతులను సభ్యసమాజం తలదించుకునేలా అసభ్య పదజాలంతో దూషించటం తో పాటు పాదయాత్ర కు పోటీగా చిల్లర రాజకీయాలు చేస్తున్న మంత్రులను, వారి వెనకుండి మాట్లాడిస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. నిజంగా వై.సి.పి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా మంత్రులు, ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించాలని బడేటి చంటి డిమాండ్ చేసారు. గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులను దారిమళ్లించిన ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన సర్పంచులను అరెస్టు చేయడం అమానుషమని ఆయన ధ్వజమెత్తారు. వై.సి.పి ప్రభుత్వం సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చివేసిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అర్ధమవుతోందన్నారు. జగన్ నేతృత్వంలోని వై.సి.పి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ ఆర్.ఎన్.ఆర్ నాగేశ్వరరావు,డివిజన్ ఇంచార్జ్ కప్పా ఉమామహేశ్వరరావు,డివిజన్ ప్రెసిడెంట్ ఆకుల ప్రసాద్,మీసాల సతీష్,మోదోవ శ్రీను,బొంగు శ్రీనివాసరావు,నున్న ఆంజనేయులు,మీసాల రాంబాబు తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author